Bhanu Priya | టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్లపై ఆమె సోదరి, నటి శాంతిప్రియ తాజాగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, భానుప్రియ ప్రస్తుత పరిస్థితిపై స్పష్టత ఇస్తూ పలు కీలక విషయాలను వెల్లడించారు. శాంతిప్రియ మాట్లాడుతూ, భానుప్రియ కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నది నిజమే కానీ, ఆమె మతిస్థిమితం కోల్పోయిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. కొన్ని సినిమాల విషయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, షూటింగ్ సమయంలో కథలు, పాత్రల్లో మార్పులు చేయడం అక్కను తీవ్రంగా కలవరపరిచాయి. సెట్‌కు వెళ్లినప్పుడు ముందుగా చెప్పిన కథ కాదని తెలిసి ఆమె మానసికంగా దెబ్బతిన్నది అని తెలిపారు.
దాదాపు 280కు పైగా సినిమాల్లో నటించి అనేక అవార్డులు అందుకున్న భానుప్రియలాంటి సీనియర్ నటి పట్ల ఇలా వ్యవహరించడం సరైంది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంత గొప్ప కెరీర్ ఉన్న నటిని ఆ పరిస్థితిలో చూడటం బాధాకరం అని అన్నారు. అలాగే భానుప్రియ వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనలు కూడా ఆమెపై ప్రభావం చూపినట్లు శాంతిప్రియ చెప్పారు. భర్త మరణం తర్వాత కొంతకాలం ఆమె తీవ్రంగా కుంగిపోయిందని, బయట కార్యక్రమాలకు వెళ్లడం తగ్గించిందని వివరించారు. ముఖ్యంగా 80ల నటీనటుల రీయూనియన్లకు కూడా ఆమెను ఆహ్వానించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
అక్కను నేరుగా సంప్రదించలేకపోతే, కనీసం మా కుటుంబ సభ్యులను సంప్రదించవచ్చు. ఇండస్ట్రీలో మా అన్నయ్య అందరికీ తెలిసిన వ్యక్తే. అయినా కూడా ఎవరూ ముందుకు రావడం లేదు అని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భానుప్రియ సినిమాల్లో నటించే అవకాశాలపై కూడా శాంతిప్రియ క్లారిటీ ఇచ్చారు. అక్క ఇకపై సినిమాలు చేయదు. అయితే నేను మాత్రం నా నటనా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను అని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆమె తీవ్రంగా స్పందించారు. దయచేసి మా అక్క గురించి అసత్య వార్తలు ప్రచారం చేయవద్దు. యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో ఎలాంటి సమాచారం లేకుండా మాట్లాడుతున్నారు. అవసరమైతే చర్యలు తీసుకోవచ్చు, కానీ మేము ఇప్పటివరకు అలా చేయలేదు అని చెప్పారు. భానుప్రియ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఉంటోందని, ఆమె కుమార్తె లండన్ లో చదువుకుంటోందని కూడా వెల్లడించారు. అప్పుడప్పుడు ఆమె అక్కడికి వెళ్తూ ఉంటుందని తెలిపారు.