Bhala Thandhanana Trailer | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్నాడు. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంటులూరి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 6న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశాడు.
‘తన పేరు శశిరేఖ.. ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్ట్. తనదో అందమైన ప్రపంచం, కానీ ఎప్పుడు ప్రమాదమైన కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జర్నలిస్టుగా ఎన్నో స్టోరీస్ కవర్ చేసింది. ఎన్నో నిజాలు బయటపెట్టింది’ అంటూ విష్ణూ, కేథరీన్ పాత్ర ఎలా ఉంటుందో తెలియజెప్పాడు. ‘ఆ రెండు వేల కోట్ల నిజం నా జీవితమైపోయింది. ఆశ డబ్బు కన్నా చాలా స్ట్రాంగ్ ఎమోషన్’ అంటూ విష్ణూ చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. శ్రీ విష్ణూ ఎప్పటిలాగానే ఈ సారి కూడా విభిన్న కథతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. కానీ ఈసారి కొంచెం కమర్షియల్ హంగులను జోడించాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కేథరీన్ థ్రెస్సా హీరోయిన్గా నటించింది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.