ఇటీవల విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో తన అందచందాలతో యువ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది మరాఠీ భామ భాగ్యశ్రీ బోర్సే. ఒక్క చిత్రంతోనే యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సొగసరికి తెలుగులో భారీ అవకాశాలొస్తున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించనుంది. దీంతో పాటు దుల్కర్ సల్మాన్ సినిమాలో కూడా ఈ భామ నాయికగా ఖరారైందని వార్తలు వినిపిస్తున్నాయి.
తొలి చిత్రంలోనే తెలుగు ప్రేక్షకులు తనపై అభిమానాన్ని చూపించారని, ఓ ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారని భాగ్యశ్రీ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. “మిస్టర్ బచ్చన్’ చిత్రంలో జిక్కీ పాత్ర ఎంతగానో నచ్చిందని నాకు సందేశాలు పంపిస్తున్నారు.
మీ ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. ఇండస్ట్రీలో నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నా తదుపరి సినిమాల గురించి ఆసక్తికరమైన విషయాలను మీతో పంచుకోవాలని ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఆ విషయాలను త్వరలో వెల్లడిస్తా’ అని పేర్కొంది.