‘కెరీర్ ఆరంభంలో కుమారిలాంటి పాత్ర దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమా కోసం 1960 నాటి కాలమాన పరిస్థితుల్ని రీక్రియేట్ చేశారు’ అని చెప్పింది భాగ్యశ్రీ బోర్సే. మిస్టర్ బచ్చన్, కింగ్డమ్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ భామ తాజాగా పీరియాడిక్ డ్రామా ‘కాంత’ చిత్రంతో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కథానాయిక భాగ్యశ్రీబోర్సే పాత్రికేయులతో ముచ్చటించింది. ఈ సినిమాలో తాను కుమారి అనే యువతి పాత్రలో కనిపిస్తానని, ఈ పాత్ర కోసం పాత తెలుగు, తమిళ సినిమాలు చూశానని, సావిత్రి, శ్రీదేవిల నటనను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పింది.
కథానాయికగా తాను తొలుత ఈ సినిమా కథనే విన్నానని, కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం కావడంతో.. ఈ గ్యాప్‌లో రెండు వేరే సినిమాలు చేశానని చెప్పింది. ‘ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, రానా వంటి సీనియర్ హీరోలతో పనిచేయడం వల్ల ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నా. ఇప్పటివరకు నన్ను గ్లామర్ హీరోయిన్‌గానే చూశాను. ‘కాంత’తో మంచి ఫర్ఫార్మర్ అంటారనే నమ్మకం ఉంది. ఇతర భాషా చిత్రాల నుంచి చాలా అవకాశాలొస్తున్నాయి. అయితే నా తొలిప్రాధాన్యం తెలుగు సినిమాకే’ అని చెప్పింది.