Year End 2023 | ‘పుష్ప 2’ పలకరించలేదు.‘దేవర’ కరుణించలేదు.‘గుంటూరు కారం’ ఘాటెక్కలేదు.‘గేమ్ చేంజర్’ వచ్చిందీ లేదు. ఇలా యంగ్ హీరోల సినిమాలు చూడకుండానే 2023 వెళ్లిపోతున్నది. 2022 సంవత్సరంలా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన చరిత్రను సొంతం చేసుకోలేక పోయినా… మంచి విజయాలతో బై చెబుతున్నది. చిరంజీవి మాస్ గ్రేస్‌ను, బాలయ్య బాబు వీరంగాన్ని, విభిన్నమైన రజనీకాంత్‌ను చూసిన తృప్తి తనకు చాలంటున్నది. ఫినిషింగ్ టచ్‌గా ప్రభాస్ ‘సలార్’ ఇచ్చిన కిక్కుతో సెండాఫ్ చెబుతున్న ఈ ఇయర్.. న్యూ ఇయర్‌కు తన జోష్‌ను బహుమతిగా అందిస్తున్నది.
‘డోన్ట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్…’ అన్నట్టుగానే మొదలైంది 2023. సంక్రాంతి రేసులో బరిలో నిలిచిన ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ రెండు సినిమాలూ నువ్వానేనా అన్నట్టుగా టికెట్లు తెగ్గొట్టాయి. బాబీ దర్శకత్వంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’లో కామెడీ టైమింగ్ అదిరిపోవడంతో చిరంజీవి అభిమానులు పండుగ చేసుకున్నారు.
మెగాస్టార్‌కు మాస్ మహారాజా రవితేజా జత కలవడంతో సంక్రాంతి పందెం రక్తికట్టింది. 2022లో ‘ఆచార్య’ వైఫల్యంతో అసహనంతో ఉన్న చిరంజీవికి ‘వాల్తేరు..’ వీర ఉత్సాహాన్నిచ్చింది. పొంగల్ దంగల్‌లో ప్రతిసారీ హిట్టు కొట్టే నటుడు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం బాలయ్య మాస్ ఇమేజ్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. మొత్తంగా గత సంక్రాంతి బరిలో నిలిచిన ఈ ఇద్దరు సీనియర్ హీరోలు మంచి సక్సెస్‌లు అందుకొని.. 2023కి ఘనమైన ఆరంభాన్నే ఇచ్చారు.
జనవరి జోరు ఫిబ్రవరిలో కనిపించలేదు. నెలలు మారుతున్న కొద్దీ ఒకట్రెండు మంచి సినిమాలు మినహా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టే చిత్రాలైతే ఈ ఏడాది పలకరించలేదు. అంచనాలతో వచ్చిన సినిమాలు గల్లంతవ్వగా, చడీచప్పుడు లేకుండా విడుదలైన సినిమాలు మంచి విజయాలు సొంతం చేసుకున్నాయి. సుహాస్ హీరోగా తెర కెక్కిన ‘రైటర్ పద్మభూషణ్’
ఫిబ్రవరిలో విడుదలై ఫీల్‌గుడ్ మూవీ అన్న పేరును సాధించింది. కామెడీ సినిమాగా అనిపించినా.. ైక్లెమాక్స్‌లో మదర్ సెంటిమెంట్ బలంగా పండటంతో ‘కలర్‌ఫొటో’ తర్వాత సుహాస్ ఖాతాలో మరో మంచి సినిమా చేరినట్టయింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘సార్’ మంచి సినిమాగా గుర్తింపు పొందింది. ధనుష్ నటించిన తొలి తెలుగు స్ట్రయిట్ చిత్రం ఇదే కావడం విశేషం. ఫిబ్రవరిలో అంచనాల్లేకుండా వచ్చి ఓ మోస్తరు హిట్ టాక్ సొంతం చేసుకున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. వినూత్న చిత్రాల హీరోగా పేరున్న కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో మంచి సినిమాగా ‘వినరో…’ నిలిచింది.
ఈ ఏడాది మార్చిలోనే దసరా సందడి చేసింది. అదేలేండి.. నాని, కీర్తి సురేష్ జంటగా వచ్చిన ‘దసరా’ సినిమా మార్చిలో విడుదలైంది. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రంపై మొదట్లో డిఫరెంట్ టాక్ వచ్చింది. అయితే, టాక్లన్నిటినీ పక్కన నెట్టి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వసూలు చేసింది. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలుగా వచ్చిన ‘రంగమార్తాండ’ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా.. కాసులు రాబట్టడంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. పక్కా తెలంగాణ భాషతో, ఆచార వ్యవహారాలతో వేణు దర్శకత్వంలో వచ్చిన ‘బలగం’ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కథాబలం ఉంటే చిన్నసినిమా అయినా పెద్ద సక్సెస్ అవుతుందని నిరూపించింది. పల్లెల్లో ప్రొజెక్టర్లు కట్టుకొని మరీ ‘బలగం’ చూశారంటే.. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో ఊహించొచ్చు.
ఏప్రిల్‌లో మణిరత్నం దర్శకత్వం వహించిన సీక్వెల్ సినిమా ‘పీఎస్-2’ ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ‘పొన్నియిన్ సెల్వన్-1’కు కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం పార్ట్ వన్ అంత గొప్పగా లేదని ప్రేక్షకులు పెదవి విరిచారు. చారిత్రక నవల ఆధారంగా తెరకెక్కిన ‘పీఎస్’ మొదటి భాగం సైతం తమిళనాడులో హిట్ కొట్టినా ఇక్కడ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ‘విరూపాక్ష’ సాయిధరమ్ తేజ్ కెరీర్లో హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అక్కినేని వారసుడు అఖిల్‌కు 2023లో కూడా నిరాశే ఎదురైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘ఏజెంట్’ భారీ పరాజయం పాలైంది.
మే నెలలో గుణశేఖర్ కలల ప్రాజెక్టు ‘శాకుంతలం’ వచ్చింది. పౌరాణిక గాథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దినా ప్రయోజనం లేకపోయింది. సమంత ప్రధాన పాత్రను ఎంతగా పండించినా.. నిదానంగా సాగే కథనం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అదే నెలలో రవితేజ హీరోగా వచ్చిన ‘రావణాసుర’ సైతం భారీ ఓటమిని చవిచూసింది. విభిన్న కథలను ఎంచుకునే శ్రీవిష్ణు నటించిన ‘సామజవరగమన’, కార్తికేయ హీరోగా వచ్చిన ‘బెదురులంక 2012’ జూన్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఆ తర్వాతి నెలలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ కాంబోలో వచ్చిన ‘బ్రో’ కలెక్షన్ల పరంగా ఫర్వాలేదనిపించింది. చిన్న చిత్రంగా విడుదలైన ‘బేబీ’ హీరో ఆనంద్ దేవరకొండకు మరో విజయాన్ని కట్టబెట్టింది.
సక్సెస్‌తో ఈ ఏడాదిని ప్రారంభించిన చిరంజీవికి ఆగస్టులో ‘భోళాశంకర్’ రూపంలో పరాజయం ఎదురైంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ‘భోళా..’ అభిమానులను అలరించలేకపోయింది. రజనీకాంత్ నటించిన ‘జైలర్’ అదేనెలలో విడుదలై అదరగొట్టింది. సెప్టెంబర్‌లో విజయ్ దేవరకొండ, సమంత జంటగా వచ్చిన ‘ఖుషి’ని ప్రేక్షకులు ఆదరించారు. యువతను ఆకట్టుకునే కథాంశం కావడంతో ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. ‘లైగర్’ పరాజయం తర్వాత ‘ఖుషి’ విజయ్‌కి మంచి విజయాన్ని అందించింది. సంక్రాంతి రేసులో సత్తా చాటిన బాలకృష్ణ అక్టోబర్‌లో వచ్చిన దసరా రేసులోనూ ముందున్నాడు. తెలంగాణ యాసతో ‘భగవంత్ కేసరి’గా ఆయన నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. నవంబర్‌లో విడుదలైన ‘కీడా కోలా’, ‘పొలిమేర 2’ చిన్న సినిమాలే అయినా కలెక్షను గట్టిగానే రాబట్టాయి.
చివరిగా డిసెంబర్లో నాని నటించిన ‘హాయ్ నాన్న’ పెద్దగా ఆకట్టుకోలేపోయింది. ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ను పలకరించిన ‘సలార్’ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రభాస్ కటౌట్‌ను దర్శకుడు ప్రశాంత్‌నీల్ ఓ రేంజ్లో వాడుకున్నాడంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. డ్రామాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినా యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్‌ను ఊహించిన దానికన్నా గొప్పగా చూపాడంటూ ప్రశాంత్‌నీల్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మొత్తంగా విజయంతో మొదలైన 2023.. మరో భారీ విజయంతో ముగుస్తుండటం హర్షించదగ్గ విషయం.