Actor Darshan | రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, నటి పవిత్ర గౌడతో పాటు మరో 15 మంది జ్యుడీషియల్ కస్టడీని బెంగళూరులోని స్థానిక కోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్‌తో పాటు మిగతా నిందితులను జూన్ 11న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో పవిత్రకు అసభ్య సందేశాలు, ఫొటోలు పంపడమే రేణుకాస్వామి హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్యోదంతంలో దర్శన్‌తో పాటు 12 మంది నిందితులు 50 రోజులుగా బెంగళూరు సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మరో నలుగురు నిందితులను తమకూరు జైలుకు తరలించారు.
రేణుకాస్వామిని చిత్రహింసలకు గురి చేసి చంపారనేందుకు ఫోరెన్సిక్ నివేదికతో పాటు పలు నివేదికలు దర్యాప్తు బృందం వద్ద ఉన్నాయని ఓ పోలీస్ అధికారి తెలిపారు. నలుగురు నిందితులు ఈ కేసులో అప్రూవర్లుగా మారారని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. నలుగురిలో కార్తీక్, నిఖిల్ నాయక్, కేశవమూర్తి, రవిశంకర్ ఉన్నారు. ఇదే కేసులో చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘం అధ్యక్షుడు రాఘవేంద్ర జూన్ 10న పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆర్థిక వివాదం కారణంగా రేణుకస్వామి హత్య చేసినట్లు నిందితులు మొదట పేర్కొన్నారు. ఆ తర్వాత తమదైన శైలిలో పోలీసులు విచారించగా.. వివరాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో హీరో దర్శన్, నటి పవిత్ర గౌడ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.