‘బలగం’ దర్శకుడు వేణు యల్దెండి తన తరువాత సినిమాగా ‘ఎల్లమ్మ’ను ఏ ముహూర్తాన ప్రకటించారో కానీ.. అడుగడుగునా అవాంతరాలతో ఓ ప్రహసనంగా ఈ సినిమా వ్యవహారం సాగుతూ వుంది. ఇప్పటివరకూ ఈ సినిమాలో నటించే హీరో ఎవరో తేలలేదు. మొదట్లో హీరోగా నాని అనుకున్నారు. అంతలో ఏమైందోఏమో.. ఆయన తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. తర్వాత శర్వానంద్ పేరు వినిపించింది. ఆ తర్వాత ఎట్టకేలకు నితిన్‌ను ఓకే చేశారు.
‘తమ్ముడు’ డిజాస్టర్ అవ్వడంతో ఆయన్ని సినిమా నుంచి తప్పించారు. దాంతో ‘ఎల్లమ్మ’ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ మధ్య శర్వానంద్, తమిళ హీరో కార్తీ పేర్లు కూడా మీడియా సర్కిల్స్‌లో వినిపించాయి. అయితే.. తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పేరు వెలుగులోకొచ్చింది. రీసెంట్గా బెల్లంకొండ సాయికి వేణు కథ వినిపించారట. దాదాపు ఖరారైనట్టేనని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి. ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.