కార్తికేయ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘బెదురులంక 2012’. ఈ చిత్రం ద్వారా క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు క్లాక్స్ చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ ‘నా అసలు పేరు ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు. సినీరంగంలోకి రాకముందు సాఫ్ట్వేర్ ఉద్యోగంతో పాటు డీజేగా కూడా పనిచేశా. రామ్‌గోపాల్‌వర్మ, సుధీర్‌వర్మ, దేవాకట్టా వద్ద దర్శకత్వ శాఖలో వర్క్ చేశాను. ‘బెదురులంక’ కథను చాలా ఏళ్ల క్రితమే రాసుకున్నా.
బెదురులంక అనే ఫిక్షనల్ ఐలాండ్‌లో కథ నడుస్తుంది. రేపటి రోజు ఉండదని తెలిసినప్పుడు మనుషుల భావోద్వేగాలు ఎలా ఉంటాయనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. కామెడీ, డ్రామా కలబోసిన డ్రామెడీ జోనర్ ఇది. అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. ఊరిని ఎదిరించే యువకుడి పాత్రలో కార్తికేయ కనిపిస్తాడు. ఆయన బాడీలాంగ్వేజ్‌కు ఈ కథ పక్కాగా కుదిరింది. ఈ కథలో భయం అనే ఎలిమెంట్ ఉంటుంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం. రెగ్యులర్ మాస్ మసాల సినిమా తరహాలో కాకుండా వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. ఇటీవలే సెన్సార్ పూర్తయింది. యు.ఏ.సర్టిఫికెట్ లభించింది. సెన్సార్ వాళ్లు కూడా చాలా కొత్త కథ అని మెచ్చుకున్నారు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారనుకుంటున్నా. నా తదుపరి సినిమా కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి’ అన్నారు.