Bala Krishna | హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ అమరావతిలో కొత్త క్యాన్సర్ కేర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తానని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తుళ్లూరులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కొత్త అధునాతన క్యాన్సర్ కేర్ క్యాంపస్‌కు బుధవారం శంకుస్థాపన జరిగింది. నందమూరి బాలకృష్ణ స్వయంగా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మిణితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ వైద్య నిపుణులు, ట్రస్ట్ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తుంది.
దేశవ్యాప్తంగా వేలాది క్యాన్సర్ రోగులకు సేవలందించిన బసవతారకం ట్రస్ట్, ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతిలో కొత్త క్యాంపస్‌తో తన సేవలను విస్తరిస్తోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో, ప్రపంచ స్థాయిలో ఉండే క్యాన్సర్ కేర్ సెంటర్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో రెండో దశలో రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటవుతుండటంతో, ఇది వైద్య పరిశోధనకు కూడా కేంద్రంగా మారనుంది. అమరావతిలో శాశ్వత రాజధాని నిర్మాణాలకు సంబంధించి తొలి దశ పనులు మళ్లీ వేగం అందుకుంటున్న వేళ, ఈ క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జీలు, IAS అధికారుల నివాస భవనాల పనులతో పాటు రూ.55 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
బసవతారకం అమరావతి క్యాంపస్ మొత్తం ప్రాజెక్ట్ విస్తీర్ణం 21 ఎకరాలు కాగా, మొదటి దశలో 500 పడకల సామర్ధ్యంతో విస్తృత శ్రేణి ఆంకాలజీ సేవలు అందిస్తారు .రూ. 750 కోట్ల పెట్టుబడితో ఈ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. తొలి దశలో ఆధునిక రేడియేషన్, సర్జరీ టెక్నాలజీలు, రోగి కేంద్రీకృత సంరక్షణ వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. 2028 నాటికి ఇది ప్రారంభం కానుంది. ఇక రెండో దశలో అదనంగా 500 పడకలు, ప్రత్యేక వైద్య విభాగాలు, రీసెర్చ్ సెంటర్, దేశవ్యాప్తంగా సంక్లిష్ట కేసులకు రిఫరల్ హబ్ సేవలు ఉంటాయి. బసవతారకం ట్రస్ట్, ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ప్రారంభించడానికి సహకరించిన దాతలకు, భాగస్వాములకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఆసుపత్రి ద్వారా అమరావతి పరిధిలోని వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి రానుంది.