Bandla Ganesh | తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆయన వయోభారం కారణంగా ఆదివారం తుది శ్వాస విడిచారు. నటుడిగా మాత్రమే కాకుండా ఎమ్మెల్యేగా కూడా ప్రజాసేవలో ముందుండిన కోటని కడసారి వీడేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి గౌరవప్రదంగా నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కోట మృతిపై స్పందించి తెలుగులో ట్వీట్ చేయడం విశేషం. ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే అటువంటి గొప్ప నటుడు మళ్లీ పుట్టరు అని భావోద్వేగానికి లోనయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి కోట నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.
ఇలాంటి విషాద సమయంలో, సినీనటుడు బండ్ల గణేష్ చేసిన ఓ ట్వీట్ వివాదాస్పదమైంది. నటులు శ్రీకాంత్, శివాజీరాజా, అలీ, ఉత్తేజ్ లతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ, “చాలా రోజుల తర్వాత స్నేహితులు ఇంటికి వచ్చారు” అంటూ ట్వీట్ చేశారు. వీరందరూ కలిసి ‘వినోదం’ చిత్రంలో నటించిన నేపథ్యంలో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.కోట మరణించి ఒక్కరోజు కూడా గడవకముందే ఇలా సెల్ఫీలు, సిట్టింగ్స్ ఏంటి? అంటూ కొంతమంది తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “పెద్దాయన పోయిన రోజే ఇలా నవ్వుతూ ఫోటోలు పోస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు. బండ్ల గణేష్ ఇంట్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోను చూపిస్తూ “మీ వెనకాల ఏదో పవర్ ఉందన్నా?” అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
కొంతమంది నెటిజన్లు మాత్రం బండ్ల గణేష్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయన శ్రద్ధాంజలి అర్పించి, మిత్రులను కలవడం తప్పా? , వాళ్లంతా పరిశ్రమలో స్నేహితులు, వ్యక్తిగతంగా కలవడం సహజం అంటూ వెనుకేసుకొచ్చారు. అయితే బండ్ల గణేష్ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇక కోటకి నివాళులు అర్పించిన తర్వాత బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావు గారు ఇండియాలోనే గొప్ప నటుడు. ఆయన గత నెలలో నాకు కబురు పంపారు, ఇంటికి వెళ్లి కలిశాను. నా నంబర్ తన మనవళ్లకి ఇచ్చి, ‘ఏ అవసరమైనా వీడిని అడగండిరా’ అని చెప్పడం నాకు ఎంతో బాధ్యతగా అనిపించింది. అలాంటి నటుడిని కోల్పోవడం నిజంగా తెలుగు సినిమాకే కాదు, కళామతల్లికే నష్టం. తెలుగు సినీ చరిత్రలో కోట గారి పేరు ఓ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంటుంది” అని పేర్కొన్నారు.