Bandla Ganesh | టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన నిర్మాతల జాబితాలో బండ్ల గణేష్ పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కమెడియన్‌గా సినిమాల్లోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్, ఆ తర్వాత నిర్మాతగా మారి భారీ బడ్జెట్ చిత్రాలతో తనదైన ముద్ర వేశారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి చిత్రంగా రవితేజ హీరోగా ‘అంజనేయులు’ను నిర్మించారు. అనంతరం పవన్ కళ్యాణ్‌తో ‘తీన్ మార్’ తెరకెక్కించినప్పటికీ, ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో బండ్ల గణేష్ ఒక్కసారిగా స్టార్ ప్రొడ్యూసర్‌గా మారిపోయారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ఆయన కెరీర్‌ను మలుపుతిప్పింది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’, రామ్ చరణ్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’, ఎన్టీఆర్‌తో ‘బాద్ షా’ వంటి భారీ సినిమాలను నిర్మించి వరుస విజయాలను అందుకున్నారు. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్, రాజకీయాల్లో బిజీ అయ్యారు. అయితే ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటూ మళ్లీ సినిమా ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు నిర్మాతగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు. ‘బీజీ బ్లాక్ బస్టర్స్’ (Bandla Ganesh Block Busters) అనే పేరుతో ప్రారంభమైన ఈ బ్యానర్‌కు తాజాగా అధికారిక లోగోను కూడా విడుదల చేశారు. ఇకపై ఈ సంస్థ నుంచి భారీ స్థాయి సినిమాలు వస్తాయని ప్రకటించారు.
అయితే ఈ బ్యానర్‌పై తొలి సినిమా ఏ హీరోతో, ఏ దర్శకుడితో తెరకెక్కనుందన్నది ఇంకా వెల్లడికాలేదు. అయినప్పటికీ బండ్ల గణేష్ తిరిగి సినిమాల్లోకి రావడంతో టాలీవుడ్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా గబ్బర్ సింగ్ స్థాయిలో బ్లాక్ బస్టర్స్ వస్తాయా లేదా అన్నదాని కోసం వేచి చూడాలి.