Bandla Ganesh | నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత అగ్ర నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి బండ్ల గణేష్. నిర్మాతగా ఆయన నిర్మించిన సినిమాలు ఎంతటి సంచలన విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రవితేజతో ‘ఆంజనేయులు’, పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’, జూనియర్ ఎన్టీఆర్‌తో ‘బాద్షా’, ‘టెంపర్’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి భారీ చిత్రాలను నిర్మించి బాక్సాఫీస్ వద్ద విజయాలు అందుకున్నారు. సినిమా నిర్మాణంతో పాటు తన ప్రత్యేకమైన మాటతీరు, భావోద్వేగ ప్రసంగాలతోనూ బండ్ల గణేష్ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే కొంతకాలంగా నిర్మాణానికి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు మరోసారి నిర్మాతగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
బండ్ల గణేష్ ఇటీవల ‘బండ్ల గణేష్ బ్లాక్‌బస్టర్స్’ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈసారి కేవలం భారీ కమర్షియల్ సినిమాలకే పరిమితం కాకుండా.. మంచి కథ, బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా కొత్త దర్శకులు, యువ నటీనటులు, ప్రతిభ ఉన్న టెక్నీషియన్లను ప్రోత్సహించేలా తన కొత్త బ్యానర్లో సినిమాలు నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ ప్రాజెక్ట్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన జీవితంలో ఎదురైన పరిస్థితులు, తనకు అండగా నిలిచిన వ్యక్తుల గురించి భావోద్వేగంగా స్పందించిన ఆయన.. ఇకపై తన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉంటుందని స్పష్టం చేశారు.తన జీవితంలో కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకుని ఉండొచ్చని అంగీకరించిన బండ్ల గణేష్.. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారిని ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొన్నారు. అవసరం ఉన్నప్పుడు దగ్గరై, అవసరం తీరిన తర్వాత దూరమయ్యే స్వభావం తనది కాదని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మంచి సినిమాలు నిర్మించడం, ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించడమే తన ముందున్న లక్ష్యం అన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ ద్వారా తన భవిష్యత్ ప్రయాణంపై బండ్ల గణేష్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని అభిమానులు భావిస్తున్నారు.