రెండేళ్ల క్రితం ‘వీరసింహారెడ్డి’గా బాలకృష్ణ చేసిన సంక్రాంతి సందడి అంతా ఇంతా కాదు. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా వందకోట్ల విజయాన్ని సాధించి బాలయ్య కెరీర్లో మెమరబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మొన్నటి సంక్రాంతికి కూడా ‘డాకూ మహరాజ్’గా బాక్సాఫీస్‌ని షేక్ చేశారు బాలకృష్ణ. ఓ వైపు వరుస విజయాలు, మరోవైపు పద్మభూషణ్ పురస్కారం.. మొత్తానికి బాలకృష్ణ మామూలు ఫామ్‌లో లేరు. ఈ జోష్‌లోనే మరోసారి మలినేని గోపీచంద్‌తో చేతులు కలిపారాయన. మైత్రీమూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం బోయపాటి ‘అఖండ-తాండవం’ షూటింగ్లో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. దసరాకు ఆ సినిమా విడుదల కానుంది. మలినేని గోపీచంద్ కూడా బాలీవుడ్లో సన్నీడియోల్తో ‘జాత్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాకే ఈ తాజా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని తెలుస్తున్నది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది.