Balayya-vijayashanti | 90లలో నందమూరి నటసింహం బాలయ్య, లేడి సూపర్ స్టార్ విజయశాంతి కాంబోకి ఎంత క్రేజ్ ఉండేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య సరసన నటించి అత్యధిక విజయాలు దక్కించుకున్న హీరోయిన్గా విజయశాంతికి మంచి పేరు ఉంది. 1984లో వచ్చిన ‘కథానాయకుడు’ నుంచి 1993లో రిలీజైన ‘నిప్పురవ్వ’ వరకు మొత్తం 16 చిత్రాల్లో ఈ జోడీ నటించారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో రెండు గోల్డెన్ జూబ్లీ చిత్రాలు కూడా ఉన్నాయి.. బాలకృష్ణ హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ అలరిస్తున్నా, విజయశాంతి తగ్గించేసింది. మహేశ్‌బాబు, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన విజయశాంతి ఇటీవలే కళ్యాణ్‌రామ్‌కి మదర్‌గా ‘సన్నాఫ్ వైజయంతి’ చిత్రంలో నటించి మెప్పించింది.
అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె ఇకపై సినిమాలు చేయనని ఆ మధ్య చెప్పుకొచ్చింది. మరి అలాంటి పరిస్థితులలో 32 ఏళ్ల తర్వాత బాలయ్యతో కలిసి ఓ సినిమా చేయనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ 2 చిత్రం చేస్తున్నాడు. సూపర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్ గా రూపొందుతోన్న ‘అఖండ-2’లో ఓ కీలక పాత్రలో విజయశాంతి కనిపించనున్నారని టాక్ గట్టిగా నడుస్తుంది. తొలి పార్ట్‌ని మించి అఖండ 2ని బోయపాటి చిత్రీకరిస్తుండగా, కీలక పాత్రలో విజయశాంతి నటిస్తే మూవీ మరో రేంజ్‌కి వెళుతుందని భావించిన బోయపాటి ఆమెని సంప్రదించినట్టు సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
బాలయ్య- విజయశాంతి నటించిన ‘ముద్దుల క్రిష్ణయ్య, ముద్దుల మావయ్య’ సినిమాలు గోల్డెన్ జూబ్లీ జరుపుకున్నాయి. బాలయ్య తొలిసారి డ్యుయల్ రోల్ లో కనిపించిన ‘అపూర్వ సహోదరులు’లోనూ విజయశాంతి ఓ నాయిక. బాలకృష్ణ తొలి పొంగల్ మూవీ ‘భార్గవరాముడు’లోనూ విజయశాంతినే కథానాయిక. వీరిద్దిరిది మంచి కాంబినేషన్. అందుకే అభిమానులు కూడా ఈ కాంబోలో ఇప్పుడు మంచి సినిమా వస్తే చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అఖండ 2 చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటతో కలసి బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మిస్తున్నారు.