బాలకృష్ణకు సంబంధించిన ఏ తాజా వార్త వెలుగుచూసినా.. అది సోషల్మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటుంది. మాస్లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ప్రస్తుతం ఆయన కేఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఊర్వశీరౌతేలా కథానాయిక. కొత్త విషయం ఏంటంటే.. ఇందులో ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. వారే ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్. ఇది నిజమైతే అభిమానులకు నిజంగా పండుగే.
ఈ సినిమాలో బాలయ్య రెండు కోణాలున్న పాత్రలో కనిపిస్తారని యూనిట్ వర్గాల సమాచారం. బాబీడియోల్ విలన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మాస్ యాక్షన్ అంశాలకు కొదువుండదట. పైగా ఈ సినిమాలో పొలిటికల్ నేపథ్యం కూడా ఉంటుందని టాక్. ‘రీసెంట్గా రషెస్ చూశాను.. ఫ్యాన్స్కి పండగే’ అంటూ సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన లీక్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. దీంతో వరుసగా నాలుగో బ్లాక్బాస్టర్ పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.
ఇదిలావుంటే.. మలయాళంలో ఈ ఏడాది భారీ విజయాన్ని అందుకున్న ఫహద్ ఫాజిల్ ‘ఆవేశం’ సినిమాను, తెలుగులో బాలయ్యతో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు ఈ చిత్రం రీమేక్ హక్కులు సొంతం చేసుకోవడంతోపాటు, బాలకృష్ణను ఒప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.