ఒకే సినిమాలో బహుపాత్రల్ని అభినయించడంలో దేశంలోనే స్వర్గీయ ఎన్టీఆర్‌ది ఓ రికార్డ్. ఆయన వారసుడిగా తెరంగేట్రం చేసిన బాలకృష్ణ.. ఈ విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు. ఇప్పుడున్న హీరోల్లో బాలకృష్ణ చేసినన్ని ద్విపాత్రాభినయాలు ఏ హీరో చేయలేదు. ‘అధినాయకుడు’ సినిమాలో ఏకంగా త్రిపాత్రాభినయం కూడా చేసేశారు బాలకృష్ణ. తాజా సమాచారం ప్రకారం త్వరలో మరోసారి ఆయన త్రిపాత్రాభినయం చేయబోతున్నారు. ఆ వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం బాలయ్య ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది.
అనంతరం గోపీచంద్ మలినేని సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్తారు బాలయ్య. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే స్వీయ నిర్మాణంలో ‘ఆదిత్య 999’ను కూడా పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు బాలయ్య. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. బాలకృష్ణ త్రిపాత్రాభినయం ఈ సినిమాలోనే అని తెలుస్తున్నది. ఈ సినిమా ప్రీక్వెల్ అయిన ‘ఆదిత్య 369’లో బాలకృష్ణ శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా ద్విపాత్రాభినయం చేశారు.
త్వరలో పట్టాలెక్కనున్న సీక్వెల్లో కథానుగుణంగా మూడు పాత్రలకు అవకాశం ఉంది. అయితే.. దర్శకుడు క్రిష్ ఆలోచన అందుకు భిన్నంగా ఉందట. కథలో చిన్న చిన్న మార్పులు చేసి, మూడు పాత్రలను రెండుగా కుదిస్తే బావుంటుందని క్రిష్ భావిస్తున్నారట. అయితే.. ఫైనల్ నిర్ణయం మాత్రం బాలయ్యదే. మూడు పాత్రలు ఉండాల్సిందేనని బాలకృష్ణ అంటే.. త్రిపాత్రాభినయం పక్కా. దర్శకుడి మాటకు తలొగ్గితే.. ద్విపాత్రాభినయమే. మరి ఏమవుతుందో చూద్దాం.