బాలకృష్ణ ‘ఆదిత్య 999’ ఎప్పుడు మొదలుపెడతారు?.. అభిమానుల్ని చాన్నాళ్లుగా వెంటాడుతున్న ప్రశ్న ఇది. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్టు గతంలో బాలకృష్ణ ప్రకటించారు కూడా. అయితే.. ఇప్పుడు బాలయ్య తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ‘ఆదిత్య 999’ బాధ్యతను వేరొక దర్శకుడి చేతిలో పెట్టారు. ఆ దర్శకుడెవరో కాదు. బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని అద్భుత విజయంగా మలిచిన క్రిష్ జాగర్లమూడే ఆ దర్శకుడు. ప్రస్తుతం బాలకృష్ణ ‘అఖండ 2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఆ తర్వాత మలినేని గోపీచంద్ సినిమాను ఆయన పట్టాలెక్కించనున్నారు. ఆ సినిమాతో పాటే ‘ఆదిత్య 999’ని కూడా సమాంతరంగా చేసేందుకు బాలయ్య నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరో విశేషం ఏంటంటే.. ‘ఆదిత్య 999’తోనే తన నట వారసుడు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయనున్నారు బాలకృష్ణ. దీనికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు క్రిష్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో బిజీ అయిపోయారు. అటు మలినేని గోపీచంద్ సినిమాకు, ఇటు ‘ఆదిత్య 999’కు.. రెండు సినిమాలకూ సంభాషణలు అందించేది సాయిమాధవ్ బుర్రానే కావడం మరో విశేషం.