నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమాకు ముహూర్తం కుదిరింది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శృతిహాసన్ నాయిక. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. నవీన్ యేర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ఈ చిత్ర షూటింగ్ శుక్రవారం సిరిసిల్ల పట్టణంలో ప్రారంభమైంది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు. యథార్థ ఘటనల ఆధారంగా అన్ని కమర్షియల్ అంశాలు చేర్చి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి మాటలు : సాయిమాధవ్ బుర్రా, సంగీతం : థమన్ ఎస్, సినిమాటోగ్రఫీ : రిషి పంజాబీ, ఎడిటర్ : నవీన్ నూలి.