Balakrishna | తినే ప్రతి మెతుకు మీద మన పేరు రాసుండాలి అని సాధారణంగా అంటుంటారు. అదే విధంగా సినిమా రంగంలో హీరోల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి అంటారు. అలా ఒక హీరోతో అనుకున్న కథ మరో హీరో దగ్గరికి వెళ్లి తిరుగులేని విజయాన్ని సాధించిన సినిమాలు బోలెడున్నాయి. అందులో క్రాక్ కూడా ఒకటి. గోపిచంద్ మలినేని మొదట ఈ సినిమాను బాలయ్యతో చేయాలనుకున్నాడట. ప్రొడ్యూసర్గా సి. కళ్యాణ్ ఫిక్సయ్యాడట. కానీ బాలయ్యకు అప్పుడు బిజీగా ఉండటంతో గోపిచంద్, రవితేజతో సినిమాను లాక్ చేశాడు. రెండేళ్ల క్రీతం వచ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్లో ఒక మైలు రాయిలా మిగిలిపోయింది.
కాగా ఈ విషయాన్ని నిర్మాత సి. కళ్యాణ్ తాజాగా బయటపెట్టాడు. తాజాగా గోపిచంద్, సి. కళ్యాణ్ నిర్మించిన ఓ సినిమా ఫంక్షన్కు గెస్ట్ వెళ్లాడు. ఈ సందర్భంగా సి. కళ్యాణ్, గోపిచంద్ గురించి మాట్లాడుతూ మా కాంబోలో ఓ బ్లాక్బస్టర్ సినిమా రావాల్సి ఉంది. కానీ ఎందుకో కుదర్లేదని చెప్పాడు. మొన్న సంక్రాంతికి బాలయ్యతో గోపి బ్లాక్బస్టర్ కొట్టాడు. ఈ కాంబో సినిమా నేను చేయాల్సింది. కానీ అది మరొకరికి రాసి పెట్టుందని చెప్పాడు. బాలయ్యతో ఆ టైమ్లో క్రాక్ అనుకున్నాం. కానీ అప్పుడు బాలయ్య డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. అలా క్రాక్ సినిమా మిస్సయ్యానని చెప్పుకొచ్చాడు.
2021లో కరోనా విజృంభిస్తున్న టైమ్లో.. దర్శక నిర్మాతలు సినిమాలు విడుదల చేయాలా వద్ధ అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు క్రాక్ ఇండస్ట్రీకి ఒక ధైర్యాన్నిచ్చింది. అది కూడా 50% ఆక్యపెన్సీతో విడుదలై నిర్మాతలపై కనక వర్షం కురిపించింది. ఎన్నో ఏళ్ల నుంచి సరైన హిట్టు లేక బాధపడుతున్న రవితేజకు క్రాక్ గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. ఈ సినిమాతో గోపిచంద్ మలినేని పేరు ఒక్కసారిగా టాలీవుడ్లో మార్మోగిపోయింది.