రజనీకాంత్ ‘జైలర్ 2’లో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారన్న వార్త వచ్చిన నాటి నుంచీ బాలయ్య అభిమానులేకాదు, సగటు ప్రేక్షకుడు సైతం ఆ కాంబినేషన్‌ను చూడాలని ఉవ్విళ్లూరారు. ఇంతలోనే అవన్నీ పుకార్లని, ‘జైలర్ 2’లో బాలయ్య నటించడం లేదని కొన్ని వెబ్సైట్లు రాశాయి. దాంతో అంతా నీరుగారిపోయారు. అసలు నిజంపై ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు. అయితే.. తాజా చెన్నై సమాచారం ప్రకారం. బాలకృష్ణ ‘జైలర్ 2’లో నటించడం ఖాయమేనట. ఇందులో ఆయన ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారట.
కాకపోతే.. సెట్లోకి బాలయ్య ఎంట్రీకి ఇంకాస్త సమయం ఉందని, ప్రస్తుతం రజనీకాంత్‌పై దర్శకుడు నెల్సన్ కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్నారని, ‘జైలర్’ని మించిన ఎమోషన్స్, ఎలివేషన్సూ ‘జైలర్ 2’లో ఉంటాయని తెలుస్తున్నది. మరోవిషయం ఏంటంటే.. ‘జైలర్’లో స్పెషల్రోల్స్లో కనిపించిన మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ ‘జైలర్ 2’లో కూడా ఉంటారట. అంటే.. మొత్తంగా బాలయ్యతో కలిపి నలుగురు సూపర్స్టార్లు ఈ సినిమాలో భాగం కానున్నారన్నమాట. ప్రేక్షకులకు ఇంతకు మించిన కన్నుల పండుగ మరొకటి ఉండదని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.