సక్సెస్ వెంట పరిగెత్తడం బాలకృష్ణకు మొదట్నుంచీ లేదు. ట్రాక్ రికార్డ్ చూసి అవకాశం ఇవ్వడం ఆయనకు చేతకాదు. ఒక్కసారి మాట ఇస్తే, ఇక చేసేసినట్టే. దర్శకుడెవరైనా సరే.. సరెండర్ అయిపోవడమే ఆయనకు తెలుసు. బాలయ్య కెరీర్‌ని ఆసాంతం పరిశీలిస్తే అది నిజమని ఎవరైనా ఒప్పుకుంటారు. బాలకృష్ణ నటించిన ‘అఖండ 2 – తాండవం’ డిసెంబర్లో విడుదల కానున్నది. నెక్ట్స్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తారు. దసరాకు ఆ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ సినిమాతోపాటు సమాంతరంగా ‘ఆదిత్య 999’ను కూడా బాలకృష్ణ పూర్తి చేస్తారని, దాన్ని క్రిష్ డైరెక్ట్ చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. మరి ‘ఘాటి’ ఫలితం తర్వాత కూడా క్రిష్‌కు బాలయ్య అవకాశం ఇస్తారా? అనేది ఫిల్మ్ వర్గాల్లో నెలకొని ఉన్న ప్రశ్న. అయితే.. ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవడం బాలయ్యకు తెలీదు.
‘ఘాటి’ రిజల్ట్కు ముందే క్రిష్‌కు ఆయన మాటిచ్చేశారు. ఇచ్చినమాటకు కట్టుబడి ‘ఆదిత్య 999’ను ముందుకు తీసుకెళ్లబోతున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ సినిమాకు కథ బాలకృష్ణే సమకూర్చారు. ఇప్పటికే క్రిష్, బాలయ్యల మధ్య కథా చర్చలు నడిచాయి. డైలాగ్ వెర్షన్ మినహా స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందట. ఇక ముందుకెళ్లడమే తరువాయి. బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని అద్భుతంగా మలిచి బాలయ్యకు మెమరబుల్ హిట్ ఇచ్చారు క్రిష్. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్‌లతో వచ్చిన వీరిద్దరూ ఆడియన్స్‌ని మెప్పించలేకపోయారు. ‘ఆదిత్య 999’తో నాలుగోసారి రాబోతున్నారు. ఈ సారి కచ్ఛితంగా హిట్ కొట్టాలనే సంకల్పంతో ఉన్నారట క్రిష్. దసరాకు ఈ సినిమాను ప్రకటించే అవకాశం ఉంది.