Balakrishna | సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ.. గత ఏడాది సంక్రాంతికి చేసిన హంగామా అంతా ఇంతాకాదు. ఒకరు ‘వీరసింహారెడ్డి’గా, ఒకరు ‘వాల్తేరు వీరయ్య’గా వచ్చి బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ను తెరకెక్కించిన కేఎస్ రవీంద్ర(బాబీ).. ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా టైటిల్ విషయంలో ఆసక్తికరమైన చర్చ నడుస్తున్నది. గత ఏడాది సంక్రాంతికి.. అటు బాలయ్యకూ, ఇటు బాబీకి కలిసి వచ్చిన ‘వీర’ సెంటిమెంట్‌ను మళ్లీ కొనసాగిస్తూ, ఈ తాజా చిత్రానికి కూడా ‘వీర’ అనే అక్షరాలు కలిసొచ్చేలా టైటిల్ పెట్టాలని మేకర్స్ యోచిస్తున్నారట.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘వీర మాస్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ టైటిల్‌ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిజిస్టర్ చేయించినట్టు కూడా వార్తలొస్తున్నాయి. మరి అభిమానులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. హిందూపురం శాసనసభ్యునిగా ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ బిజీగా ఉండటంతో, ఆయన లేని సన్నివేశాలను, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు దర్శకుడు బాబీ.