నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నెల 24న ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు జరుగనున్నాయి. వచ్చే నెల తొలివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని సమాచారం. బ్లాక్‌బస్టర్ ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలయ్య, మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు సినిమాపై భారీగా ఉన్నాయి.
అందుకు తగ్గట్టే ఓ విభిన్నమైన కథను తయారు చేశారట మలినేని. రెండు కాలాల్లో ఈ కథ నడుస్తుందని సమాచారం. ప్రస్తుత కాలంలో కథ మొదలై.. ద్వితీయార్ధంలో కొత్త మలుపు తీసుకొని, వందల ఏళ్ల వెనక్కి, అంటే.. రాజుల కాలానికి ఈ కథ వెళుతుందట. ఈ కాలానికీ, ఆ కాలానికీ మధ్య సంబంధం ఏంటి? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశమని తెలుస్తున్నది.
ఇందులో బాలకృష్ణ మాఫియా డాన్‌గా, రాజులకాలం నాటి యోధుడుగా రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. సెకండాఫ్ అంతా యాక్షన్ ఎలిమెంట్స్‌తోనే సాగుతుందని వినికిడి. డైలాగ్ వెర్షన్ మినహా స్క్రిప్ట్ పూర్తయింది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.