“బలగం’ చిత్రం తెలుగు ఇండస్ట్రీలో గేమ్ ఛేంజర్ అవుతుంది. ప్రధాన స్రవంతి వాణిజ్య చిత్రాల నమూనాలో ఓ చక్కటి బతుకు చిత్రాన్ని తీశారు. దిల్‌రాజు సంస్థలో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుంది’ అన్నారు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. ‘బలగం’ చిత్రంలోని మూడో పాటను శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు.
ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. వేణు ఎల్దండి దర్శకుడు. మార్చి 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ మాట్లాడుతూ ‘మన సంస్కృతి తాలూకు మూలాలు, మానవ సంబంధాల్ని ఈ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారు. వేణు నటుడిగా ఇన్నాళ్లు నవ్వించాడు. దర్శకుడిగా ఈ సినిమాతో కడుపారా ఏడిపిస్తాడు. తెలంగాణ సినిమాకు దిద్దిన తిలకం ఈ బలగం’ అన్నారు.
దిల్‌రాజు మాట్లాడుతూ ‘నిజామాబాద్, మహబూబాబాద్‌లో షోలు వేశాం. తమ కుటుంబాల్ని తెరపై చూసుకున్నట్లుందని చెబుతున్నారు. సెన్సార్ వారు ఈ సినిమా చూసి ఇదొక జీవితమని ప్రశంసించారు. నేను వెనక ఉన్నాను కాబట్టి ఇది పెద్ద సినిమాలా అనిపిస్తున్నది. కానీ ఇది చాలా చిన్న సినిమా’ అని చెప్పారు. ఓ చిన్న సినిమాకు దిల్‌రాజు బలగం అంతా వచ్చి సపోర్ట్ చేశారని దర్శకుడు వేణు ఆనందం వ్యక్తం చేశారు. ఈ తరహా చిత్రాల్ని థియేటర్లో చూస్తేనే గొప్ప అనుభూతి పొందుతామని ప్రియదర్శి పేర్కొన్నారు.