తెలంగాణ పల్లె సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన ‘బలగం’ చిత్రం చరిత్ర సృష్టించిందని రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం అన్నారు. హైదరాబాద్ ఎఫ్డీసీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ‘బలగం’ చిత్ర బృందానికి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం చిత్రంలోని నటీనటులను, యూనిట్ సభ్యులను, దర్శకనిర్మాతలను శాలువాతో సన్మానించి జ్ఞాపికల్ని అందజేశారు. అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ‘ఈ సినిమాలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చక్కగా ఆవిష్కరించారు. కొత్తవారిని పరిచయం చేస్తూ ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో దిల్‌రాజు ప్రొడక్షన్స్ స్థాపించిన నిర్మాతలు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డిలకు నా అభినందనలు. తెలంగాణ సినిమా పురోభివృద్ధికి ప్రభుత్వం తరపున ప్రోత్సాహం అందించడానికి కృషి చేస్తాం’ అన్నారు. ప్రభుత్వం తరపున ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ‘బలగం’ చిత్రానికి సత్కారం జరగడం ఆనందంగా ఉందని నిర్మాత దిల్‌రాజు పేర్కొన్నారు. ఎఫ్డీసీ తరపున ‘బలగం’ చిత్ర బృందాన్ని సత్కరించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎఫ్డీసీ ఛైర్మన్ అనిల్ కూర్మాచలం కు చిత్ర దర్శకుడు వేణు ధన్యవాదాలు తెలిపారు.