Bala Krishna | టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణలకు తెలుగులో ఉన్న స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరు పదుల వయసులోనూ తమదైన శైలితో ప్రేక్షకులను మెప్పిస్తూ, యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. తెలుగులో వీరిద్దరికీ అశేషమైన అభిమాన గణం ఉండటంతో పాటు భారీ మార్కెట్ కూడా ఉంది. అయితే నార్త్ మార్కెట్ విషయానికి వస్తే చిరంజీవి, బాలకృష్ణలకు ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కడం లేదనే అభిప్రాయం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి స్వాతంత్య్ర పోరాట యోధుడి కథతో తెరకెక్కిన ‘సైరా నరసింహ రెడ్డి’ సినిమాతో నార్త్ ఆడియన్స్‌ను టార్గెట్ చేశారు. భారీ బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించడం వంటి అంశాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
కానీ హిందీలో పెద్ద ఎత్తున రిలీజ్ చేసినప్పటికీ, సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. వసూళ్లు పరిమితంగానే నమోదయ్యాయి. ఆ తర్వాత మలయాళ సూపర్ హిట్ ‘లూసిఫర్’ రీమేక్‌గా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ తో మరోసారి చిరంజీవి నార్త్ మార్కెట్లో తన అదృష్టాన్ని పరీక్షించారు. రాజకీయ నేపథ్యం, పవర్ఫుల్ పాత్ర ఉన్నప్పటికీ ఈ సినిమా కూడా హిందీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇదే సమయంలో నటసింహం బాలకృష్ణ కెరీర్లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘అఖండ’ సినిమాతో నార్త్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనే కాదు, హిందీ డబ్బింగ్ వెర్షన్‌కి కూడా యూట్యూబ్, టీవీ ప్రసారాల ద్వారా మంచి ఆదరణ లభించింది.
ఈ నేపథ్యంలో ‘అఖండ 2: తాండవం’ పై హిందీలో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సీక్వెల్ నార్త్ మార్కెట్లో క్లిక్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ రిలీజ్ తర్వాత పరిస్థితి భిన్నంగా మారింది. హిందీ వెర్షన్‌కు థియేటర్లలో స్పందన నెమ్మదిగా ఉండటంతో వసూళ్లు నిరాశపరిచినట్లు సమాచారం. ఇప్పటివరకు కలెక్షన్లు కోటి రూపాయల మార్క్‌ను కూడా దాటలేదనే ప్రచారం జరుగుతోంది. దీంతో చిరంజీవి హిందీ సినిమాల కంటే బాలకృష్ణ సినిమా మరింత తక్కువ వసూళ్లు సాధించిందన్న చర్చ మొదలైంది. బాలీవుడ్ మార్కెట్లో ‘అఖండ 2’ విషయంలో అంచనాలు ఒకలా, ఫలితాలు మరోలా వచ్చాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజులలో అయిన వీరు అనుకున్నది సాధిస్తారా అన్నది చూడాలి.