Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో కెరీర్లో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘NBK112’ (వర్కింగ్ టైటిల్) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుక ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సినిమాను రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల భారీ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఆగస్టు నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని, 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ముందుకు సాగుతోందని తెలిపారు.రాజధాని అమరావతిలో ఒక భారీ సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించాలనేది బాలకృష్ణ చిరకాల కోరిక అని నిర్మాత వెల్లడించారు. ఆ కల తమ సినిమాతో సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నేను వ్యక్తిగతంగా ప్రకాశం జిల్లాకు చెందినవాడిని. మన సొంత రాజధానిలో ఈ చిత్రాన్ని ప్రారంభించడం ఎంతో గర్వంగా ఉంది. గత మూడు, నాలుగు సంవత్సరాలుగా బాలకృష్ణ గారితో సినిమా చేయాలనే ప్రయత్నం ఇప్పుడు ఫలించింది” అని సుధాకర్ చెరుకూరి అన్నారు.
ఈ చిత్రం కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ కళాకారులు, సాంకేతిక నిపుణులకు మంచి వేదికగా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. ఏపీలో ఉన్న ప్రతిభావంతులైన యువతకు సినిమా రంగంలో అవకాశాలు కల్పించే దిశగా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని, స్థానిక టాలెంట్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ పూజా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మాస్ ఎలిమెంట్స్, బలమైన భావోద్వేగాలు, సామాజిక అంశాలను కలగలిపిన కథతో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గ యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు కొరటాల మార్క్ మెసేజ్ కూడా ఇందులో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అమరావతి వేదికగా ప్రాజెక్ట్ ప్రారంభం కావడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.