Bala Krishna | ఆదివారం రోజు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా పైలాన్ ను ఆవిష్కరించారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ.. మాట్లాడుతూ ఈ ఆసుపత్రిని డబ్బులు, లాభాల కోసం ఏర్పాటు చేసింది కాదని అన్నారు. వ్యక్తిగత నష్టం వలన కలిగిన ఆలోచన నుండి పుట్టిందని అన్నారు. నా తల్లి క్యాన్సర్తో చనిపోవడం వలన అందరికి క్యాన్సర్ చికిత్స అందించాలనే లక్ష్యంతోనే నా తండ్రి ఎన్టీఆర్ ఈ ఆసుపత్రి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 110 బెడ్స్తో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ ఈ రోజు స్టేట్ ఆఫ్ ఆర్ట్ పరికరాలతో దేశంలోనే అత్యున్నత ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచిందని అన్నారు.
అయితే ఈ ఆసుపత్రికి సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభూత్వానికి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ బాలయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏపీలో కూడా సహకారం అందిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి కూడా బాలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.. వెయ్యి బెడ్స్తో త్వరలో అమరావతిలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన ఆయన 300 బెడ్స్తో తొలి దశలో ఆసుపత్రిని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఎంతో మంది దాతలు మంచి సంకల్పంతో ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించారని బాలయ్య ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఛైర్మన్ బాలకృష్ణతో పాటుగా.. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సమయంలో బాలయ్య.. తనకు దామోదర రాజ నరసింహ పేరుతో ఒక సినిమా చేయాలని ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రానికి దామోదర రాజనర్సింహ టైటిల్ కాకుండా దబిడి దిబిడి రాజనర్సింహ అని టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక బాలకృష్ణ చేసిన సేవలకి గాను ఆయనకి పద్మ భూషణ్ అవార్డ్ వరించిన విషయం తెలిసిందే.