Bala Krishna | ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల సందర్భంగా మంగళవారం టీడీపీ శాసనసభాపక్ష (టీడీఎల్పీ) కార్యాలయం ఓ సరదా క్షణానికి వేదికైంది. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన సరదా కామెంట్‌తో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుల పారవశ్యంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే, విరామ సమయంలో బాలకృష్ణ టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే అక్కడ ఉన్న పలువురు మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. ఇదే సమయంలో తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టిన ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, బాలకృష్ణను ఉద్దేశించి, “నన్ను ఆశీర్వదించండి అంకుల్” అని కోరారు.
దీనికి బాలకృష్ణ తనదైన శైలిలో స్పందిస్తూ.. “నో అంకుల్… ఓన్లీ బాలయ్య!” అని నవ్వుతూ చెప్పడంతో, అక్కడున్న సభ్యులందరూ పగలబడి నవ్వారు. ఈ సరదా కామెంట్‌తో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ సంభాషణ అనంతరం, మీడియా మరియు పార్టీ సభ్యులు బాలకృష్ణను ఆయన తదుపరి సినిమా ‘అఖండ-2’ గురించి ప్రశ్నించారు. దీనిపై స్పందిస్తూ ఆయన, “ఈ నెల 25న నా తమ్ముడు పవన్ కల్యాణ్ గారి సినిమా విడుదలవుతోంది. ఆ సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘అఖండ-2’ సినిమాను డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం” అని ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు సంధ్యారాణి, అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్‌గా బాలకృష్ణను నియమించి ప్రచారం చేయాలని కోరారు. ఆమె అభ్యర్థనకు బాలకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన రావచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. తన చలాకితనంతో, హాస్యంతో శాసనసభ మైదానంలో బాలకృష్ణ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన సరదా వ్యాఖ్యలతో పాటు సినిమాలపై పంచుకున్న వివరాలు టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయాన్ని ఉల్లాసభరితంగా మార్చాయి. బాలయ్య నటిస్తున్న అఖండ 2 చిత్రం భారీ అంచనాలతో పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. బోయపాటి తెరకెక్కించిన ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తుండడం విశేషం.