Bala Krishna | సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘అఖండ 2: తాండవం’ ఇటీవల థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాను 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించగా, ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడగా, తాజాగా వరల్డ్ వైడ్‌గా రిలీజై ప్రీమియర్స్ నుంచే మంచి స్పందన తెచ్చుకుంటోంది.ఎప్పటి నుంచో సినిమా కోసం ఎదురుచూస్తున్న బాలయ్య అభిమానులు విడుదల రోజు థియేటర్ల వద్ద ఓ రేంజ్లో సందడి చేశారు. సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి, థియేటర్లను ప్రత్యేకంగా డెకరేట్ చేశారు.
షో పడే ముందు డప్పులు కొడుతూ, నృత్యాలు చేస్తూ తమ అభిమాన హీరో సినిమాను పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లిలో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ కొందరు బాలయ్య ఫ్యాన్స్ మాన్షన్ హౌస్ మందు బాటిల్‌తో ‘అఖండ 2’కు దిష్టి తీశారు. సినిమా చూసిన అనంతరం థియేటర్ వెలుపల బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్‌కు దిష్టి తీశామని వారు తెలిపారు. ఎవరి దిష్టి పడకూడదన్న నమ్మకంతో అలా చేశామని చెప్పడంతో పాటు, దాన్నే తీర్థంగా తీసుకుంటామని కూడా వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న కొందరు అభిమానులకు ఆ మందును చేతిలో కూడా వేశారట. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు, సినీ ప్రియులు భిన్నంగా స్పందిస్తున్నారు. సాధారణంగా నిమ్మకాయలు, గుమ్మడికాయలతో దిష్టి తీయడం చూస్తుంటామని, కానీ మందుతో దిష్టి తీయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “ఇదెక్కడి పిచ్చి?” అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇది కొత్త విషయం కాదని కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడినప్పుడు, కొందరు అభిమానులు మాన్షన్ హౌస్ మందుతో బాలయ్య పోస్టర్‌కు అభిషేకం చేసి, దిష్టి తీసిన వీడియో కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు మళ్లీ అదే తరహా ఘటన జరగడంతో మరోసారి చర్చకు దారి తీసింది.