Bala Krishna | తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న నటసింహం నందమూరి బాలకృష్ణ మరోసారి తన సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నారు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ చిత్రాలతో వరుసగా నాలుగు సార్లు 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచిన బాలయ్య… ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ పై గురి పెట్టారు. బాలయ్య- బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘అఖండ 2’ సినిమాపై మాంచి హైప్ ఏర్పడింది. ఇది బాలకృష్ణ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్లో భారీ స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ చిత్రం 100 కోట్ల మార్కును అందుకోవడమే కాకుండా, బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించనుందని చెబుతున్నారు. సినీ పరిశ్రమలో బాలయ్యకి పోటీగా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్లు ఉన్నా కూడా, బాలయ్య వరుసగా నాలుగు బ్లాక్బస్టర్లతో క్రేజీ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పుడు ‘అఖండ 2’తో ఐదో హిట్ కొట్టాలనుకుంటున్న బాలయ్య ఆ తర్వాత గోపీచంద్ మలినేని సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
తాజా ప్రకారం, ‘అఖండ 2’ షూటింగ్ త్వరలో పూర్తవుతుందని, డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఆలస్యం అయితే సంక్రాంతి బరిలో పందెం కోడిలా దిగనున్నారు బాలయ్య. ‘వీరసింహారెడ్డి’ విజయం తరువాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో కమర్షియల్ ఎంటర్టైనర్ సెట్స్‌పైకి రానుంది. గోపీచంద్ మలినేని ఇప్పటివరకు తెరకెక్కించిన 8 చిత్రాల్లో 7 విజయవంతమవడం, బాలీవుడ్లో ‘జాట్’ చిత్రంతో డెబ్యూట్ చేసి అక్కడ కూడా గుర్తింపు పొందడం ఈ కాంబోపై భారీ అంచనాలను పెంచుతోంది.