Bala Krishna | నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన భారీ అవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2’ బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్‌తో దూసుకెళ్తోంది. కొన్నేళ్ల క్రితం సంచలన విజయం సాధించిన ‘అఖండ’కు సీక్వెల్‌గా ‘అఖండ 2: తాండవం’ పేరుతో విడుదలైన ఈ చిత్రం, మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ బాలయ్య రికార్డుల పరంపరను కొనసాగిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా మార్కెట్లో బాలకృష్ణకు ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. ‘అఖండ 2’తో కలిపి బాలయ్య వరుసగా ఐదు సినిమాలు యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్ల మార్క్‌ను అందుకోవడం విశేషంగా మారింది.
ఈ జాబితాలో అఖండ 1, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 ఉన్నాయి. సీనియర్ హీరోగా ఇలా వరుసగా ఐదు సినిమాలు ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం చాలా అరుదైన రికార్డుగా నిలుస్తోంది. ఇదే కాకుండా, బాలయ్య నార్త్ అమెరికాలో మొత్తం ఆరు 1 మిలియన్ డాలర్ల సినిమాలు కలిగిన ఏకైక సీనియర్ హీరోగా కూడా రికార్డు సృష్టించారు. ఈ లిస్ట్‌లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా కూడా ఉండటం విశేషం. దీంతో టాలీవుడ్ సీనియర్ హీరోలలో యూఎస్ మార్కెట్ విషయంలో బాలకృష్ణదే స్పష్టమైన ఆధిపత్యంగా సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
క్రిటిక్స్ టాక్ ఎలా ఉన్నా, అభిమానుల మద్దతు మరియు బాక్సాఫీస్ స్థిరత్వంతో బాలయ్య తన మార్కెట్ పవర్‌ను మరోసారి నిరూపించారు. ‘అఖండ 2’ విజయం నందమూరి అభిమానులకు మాత్రమే కాకుండా, సీనియర్ హీరోలకూ స్ఫూర్తినిచ్చే రికార్డుగా నిలుస్తోంది. ఇక బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ప్రస్తుతం ఎన్బీకే 111 చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ చిత్రం కూడా బాలయ్యకి బంపర్ హిట్ అందిస్తుందని విశ్వసిస్తున్నారు.