Bakasura Restaurant Trailer | తెలుగు చిత్ర పరిశ్రమలో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ ఇప్పుడు హీరోగా నటిస్తున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం మేకర్స్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఎస్జే శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్తో పాటు పలువురు ముఖ్య తారాగణం ఇందులో ఉన్నారు. ఎస్జే మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హంగర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, తన కెరీర్‌ను మలుపు తిప్పిన ‘ప్రేమకథా చిత్రం’ దర్శకుడు మారుతి తన సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. మారుతి మాట్లాడుతూ, టైటిల్‌తోనే సినిమా విజయం సాధించిందని, ప్రవీణ్‌ను హీరోగా చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని తెలిపారు. ఈ సినిమా ప్రవీణ్ కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నిర్మాత జనార్ధన్ ఆచారి మాట్లాడుతూ, దర్శకుడు శివ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే ప్రవీణ్‌ను హీరోగా ఎంపిక చేశామని తెలిపారు. దర్శకుడు ఎస్జే శివ మాట్లాడుతూ, ప్రవీణ్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉందని, ఇది వరకు తెలుగులో రాని కథాంశంతో ఈ సినిమాను రూపొందించామని చెప్పారు. వైవా హర్ష మాట్లాడుతూ, ఈ సినిమా అందరికీ బెంచ్‌మార్క్ ఫిల్మ్ అవుతుందని, ఇది ట్రెండింగ్ హారర్ జోనర్లో వస్తున్నందున తప్పకుండా విజయం సాధిస్తుందని అన్నారు.
ఈ చిత్రంలో ప్రవీణ్, వైవా హర్ష, షైనింగ్ ఫణి (బమ్చిక్ బంటి), కేజీఎఫ్ గరుడ రామ్, కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్ణ, వివేక్ దండు, అమర్, రామ్‌పటాస్, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్, జబర్దస్త్ అప్పారావు తదితరులు నటిస్తున్నారు. సినిమాకు బాల సరస్వతి డీఓపీగా, మార్తాండ్.కె.వెంకటేష్ ఎడిటర్‌గా, వికాస్ బడిస సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.