Bakasura Restaurant | చిన్న సినిమాగా వచ్చి థియేటర్లో మంచి విజయం అందుకున్న ‘బకాసుర రెస్టారెంట్’ చిత్రం తాజాగా ఓటీటీలో దుమ్ము రేపుతుంది. ఇటీవలే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చిన రెండు రోజులకే ఈ చిత్రం టాప్ 4 ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఈ విషయంపై చిత్రబృందం తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
ప్రముఖ కమెడియన్లు ప్రవీణ్ (Praveen) వైవా హర్ష (Harsha Chemudu) ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించగా.. ఎస్జే శివ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని ఎస్జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి ఈ సినిమాను నిర్మించారు. కామెడీ ఎంటర్టైనింగ్గా వచ్చిన ఈ సినిమాలో షైనింగ్ ఫణి (బమ్చిక్ బంటి), కేజీఎఫ్ గరుడ రామ్, కృష్ణభగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఉప్పెన జయకృష్న, వివేక్ దండు, అమర్, రామ్‌పటాస్, రమ్య, ప్రాచీ ఠాకూర్, జబర్థస్త్ అప్పారావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన పరమేశ్వర్ (ప్రవీణ్) తన నలుగురు స్నేహితులతో కలిసి ఒకే రూమ్‌లో ఉంటూ జీవనం సాగిస్తుంటాడు. తనకు ఇష్టం లేకపోయినా డబ్బుల కోసం ఉద్యోగం చేస్తుంటాడు. అయితే ఎలాగైనా ఒక రెస్టారెంట్ పెట్టాలనేది పరమేశ్వర్ కల. ఒకసారి తన స్నేహితులతో ఈ విషయం చెప్పగా.. డబ్బుల కోసం యూట్యూబ్‌లో దెయ్యాల వీడియోలు చేద్దామని సలహా ఇస్తారు. అనుకున్నట్లుగానే వాళ్ళు చేసిన మొదటి వీడియో బాగా వైరల్ అవుతుంది. రెండో వీడియో కోసం ఒక పాడు బడిన బంగ్లాకి వెళతారు. అక్కడ వారికి ఒక మంత్రాలతో ఉన్న పుస్తకం దొరుకుతుంది. దీంతో దానిని వెంటబెట్టి రూమ్‌కి తెచ్చుకుంటారు. ఈ పుస్తకంలో ఉన్నట్లుగా మంత్ర పూజ చేయగా, 200 ఏళ్ల నాటి ఆత్మ ఒక నిమ్మకాయలోకి వస్తుంది. ఆ ఆత్మకు విపరీతమైన ఆకలి. ఇంట్లో ఉన్న ఆహారం మొత్తాన్ని తినేస్తుంది.
ఆ నిమ్మకాయలోని ఆత్మను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తుండగా, పరమేశ్వర్ రూమ్‌లోకి వచ్చిన అంజిబాబు (ఫణి) శరీరంలోకి ఆ ఆత్మ ప్రవేశిస్తుంది. ఇప్పుడు అంజిబాబు శరీరంలో ఉన్న ఆత్మను వదిలించడానికి పరమేశ్వర్ అతని స్నేహితులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు? అసలు బక్క సూరి (వైవా హర్ష) ఎవరు? అతనికి ఉన్న రోగం ఏంటి? అంజిబాబులో ఉన్న ఆత్మ బక్క సూరిదే అని తెలిసిన తర్వాత పరమేశ్వర్ ఏం చేశాడు? అంజిబాబు శరీరం నుంచి ఆ ఆత్మ బయటకు వెళ్లిందా లేదా? రెస్టారెంట్ పెట్టాలన్న పరమేశ్వర్ కోరిక నెరవేరిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.