Dialogues | ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కాంపిటీషన్ ఎక్కువైంది. ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేదు. ఇలాంటి సమయంలో దర్శక నిర్మాతలు సినిమాపై ఆసక్తి కలిగించి థియేటర్స్‌కి వచ్చేలా ప్లాన్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ కోసం సరికొత్త దారులు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే బూతుల వాడకం ఎక్కువైంది. సినిమా రిలీజ్‌కి ముందు టీజర్ , ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు అందులో బూతులని గట్టిగా వాడుతున్నారు. మరి మేకర్స్ బూతులు సినిమా మీద అటెన్షన్ క్రియేట్ చేస్తాయాని గట్టిగా నమ్ముతున్నారా, అందుకే సినిమాలలో కొన్ని బూతు డైలాగులని తప్పని సరి వాడుతున్నారా అన్న ప్రశ్న తలెత్తుతుంది.
అయితే ఈ బూతు డైలాగుల ట్రెండ్ ఇప్పటిది కాదు. అర్జున్ రెడ్డి నుండి నడుస్తుంది. అర్జున్ రెడ్డి సినిమా టైమ్‌లోనే బూతులతో పబ్లిసిటీ చేసుకోవటం మొదలైంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అందులోని బూతులని విని అందరు అవాక్కయ్యారు. కొందరు దీనిపై ఘాటుగా కూడా స్పందించారు. అయితే ఈ బూతుల విషయంలో జరిగిన రచ్చ సినిమాలకి బజ్ తీసుకురావడంలో ఉపయోగపడింది కూడా. రీసెంట్గా వచ్చిన జాక్ ట్రైలర్లో కూడా బూతులను గట్టిగా వాడారు. నిజానికి ట్రైలర్లో వినిపించిన ఆ డైలాగులు సినిమాలో ఉంటాయో ఉండవో కూడా తెలియదు. సెన్సార్ వారు వాటి విషయంలో అభ్యంతరం చెప్పడం జరుగుతుంది.
సెన్సార్ వారు మ్యూట్ చేయడమో లేదంటే తొలగించచడమో చేస్తారని చిత్ర యూనిట్‌కి కూడా తెలుసు, అయినా కూడా వారు సినిమాకు హైప్ తీసుకురావటం కోసం ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నట్టుగా అర్ధమవుతుంది. కుర్ర హీరో విశ్వక్సేన్ అయితే తన ప్రతీ సినిమా ట్రైలర్లో ఇలాంటి అభ్యంతరకర పదాలు ఉండేలా ప్లాన్ చేసుకొని సినిమాపై బజ్ పెరిగేలా చేస్తాడు.. ఫలక్నమాదాస్, దమ్కీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల ట్రైలర్స్‌లో బూతులు వినిపించాయి. రీసెంట్గా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ ది పారడైస్ సినిమా టీజర్లో కూడా దారుణమైన బూతు పదం వినిపించింది. నాని లాంటి హీరో సినిమాలో కూడా ఇలాంటి బూతు పదం విని అందరు ఆశ్చర్యపోయారు. ఇప్పట్లో ఈ ట్రెండ్ ఆగేలా కనిపించడం లేదు.