చిత్రం: బ్యాడ్ గాళ్స్ (కానీ చాలా మంచోళ్లు)
నటీనటులు: అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న, రేణు దేశాయ్, మొయిన్, స్రవంతి చొకరాపు తదితరులు.
దర్శకత్వం: ఫణి ప్రదీప్ ధూళిపూడి
సంగీతం: అనూప్ రూబెన్స్
విడుదల తేదీ: 25 డిసెంబర్, 2025
ట్రైలర్‌తోనే యూత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘బ్యాడ్ గాళ్స్’ (కానీ చాలా మంచోళ్లు) మూవీ నేడు (డిసెంబర్ 25) థియేటర్లలోకి వచ్చింది. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ ఫణి ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, నేటి తరం అమ్మాయిల ఆలోచనలు, స్నేహం మరియు క్రైమ్ థ్రిల్లర్ అంశాల సమాహారంగా రూపొందింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథ
హైదరాబాద్‌లోని ఒక లేడీస్ హాస్టల్లో నివసించే రోజీ రెడ్డి, మల్లీశ్వరి, మెర్సీ, వెంకట లక్ష్మి నలుగురు ప్రాణ స్నేహితులు. వీరిలో ఇద్దరికి ఎంగేజ్మెంట్ కావడంతో, పెళ్లికి ముందు ఒక మర్చిపోలేని ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేస్తారు. స్రవంతి సాయంతో మలేషియా వెళ్లిన ఈ నలుగురు అమ్మాయిలు అక్కడ ఊహించని చిక్కుల్లో పడతారు. ఒక అంతర్జాతీయ ముఠా వీరిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అసలు ఆ ముఠా వీరిని ఎందుకు టార్గెట్ చేసింది? ఈ నలుగురు స్నేహితులు ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారు? అనేదే ఈ చిత్ర కథ.
విశ్లేషణ
సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు ‘ఈ నగరానికి ఏమైంది’ స్టైల్లో ఫన్నీగా సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో సినిమా కామెడీ నుండి క్రైమ్ థ్రిల్లర్‌గా మారుతుంది. కథలో కొన్ని లాజిక్కులు పక్కన పెడితే, ఎక్కడా బోర్ కొట్టకుండా దర్శకుడు స్క్రీన్ ప్లేని నడిపించారు. పంచ్ డైలాగులు యువతకు బాగా కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా నలుగురు అమ్మాయిలు అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్న తమ పాత్రల్లో ఒదిగిపోయారు. నేటి తరం యువతుల బాడీ లాంగ్వేజ్‌ను, ఎనర్జీని స్క్రీన్‌పై అద్భుతంగా పండించారు. వీరి మధ్య వచ్చే సంభాషణలు, అల్లరి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ పాత్రలో మెరిశారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు బలాన్ని ఇచ్చింది. మొయిన్, రోహన్, సూర్య తమ వంతు ఎంటర్టైన్మెంట్ అందించగా.. తాగుబోతు రమేష్, రాజా రవీంద్ర కామెడీ టైమింగ్‌తో నవ్వించారు.
సాంకేతిక విభాగం
దర్శకుడు ఫణి ప్రదీప్ ఒక సింపుల్ ఫ్రెండ్షిప్ స్టోరీకి క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ని జోడించి ఆసక్తికరంగా మలిచారు. అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేసింది. చంద్రబోస్ సాహిత్యం పాటలకు అదనపు ఆకర్షణగా నిలిచింది. మలేషియా లొకేషన్లలో చిత్రీకరించిన విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి.
బాటమ్ లైన్: లాజిక్కుల కంటే వినోదానికి ప్రాధాన్యత ఇచ్చే వారికి, ముఖ్యంగా క్రైమ్ కామెడీని ఇష్టపడే యూత్‌కి ‘బ్యాడ్ గాళ్స్’ ఒక మంచి ఛాయిస్. ఈ వీకెండ్లో సరదాగా థియేటర్లో నవ్వుకోవడానికి ఈ సినిమాను చూడొచ్చు.
రేటింగ్: 2.75/5