 
                                                            Baahubali The Eternal War | బాహుబలి సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన ఈ ఫ్రాంచైజ్ ఇప్పుడు మరోసారి చర్చల్లో నిలిచింది. ఇప్పటికే ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో రెండు సినిమాలను కలిపి రీ-రిలీజ్ చేయగా, అదే సందర్భంగా ప్రేక్షకులకు మరో సర్ప్రైజ్ ఇచ్చారు. థియేటర్లలో ‘బాహుబలి ది ఎపిక్’ ప్రదర్శన సందర్భంగా, కొత్త యానిమేషన్ చిత్రం ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ (Baahubali: The Eternal War) టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీజర్లో బాహుబలి చిన్ననాటి సన్నివేశాలు, శివగామి పెంపకం, బాహుబలి మరణం తర్వాత అతని ఆత్మ పై లోకాలకు వెళ్లడం, దేవతలు–రాక్షసుల మధ్య యుద్ధం, బాహుబలి ‘మంచి రాక్షసుడిగా’ చూపించబడడం వంటి సన్నివేశాలు కనిపించాయి. దీంతో కథపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
రాజమౌళి ఇప్పటికే ఇంటర్వ్యూలో ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “ఇది బాహుబలి 3 కాదు. కానీ బాహుబలి కథకి కంటిన్యూషన్ ఉంటుంది. ఇది 3D యానిమేషన్ రూపంలో వస్తుంది. కథను ఇషాన్ శుక్లా దర్శకత్వం వహిస్తుండగా, నేను పర్యవేక్షిస్తున్నాను. రెండున్నరేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై వర్క్ జరుగుతోంది. బడ్జెట్ సుమారు ₹120 కోట్లు. ఇందులో అన్ని బాహుబలి పాత్రలతో పాటు కొత్త క్యారెక్టర్లు కూడా కనిపిస్తాయి” అని తెలిపారు. ఇక టీజర్‌లోని “పార్ట్ 1” ట్యాగ్ చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ సిరీస్‌లో ఇంకా మరిన్ని భాగాలు రాబోతున్నాయని అర్థం.
ఈ యానిమేషన్ చిత్రాన్ని 2026 లేదా 2027లో విడుదల చేయనున్నారని సమాచారం. మొత్తానికి, ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ టీజర్‌తో మరోసారి ప్రేక్షకుల్లో బాహుబలి ఫీవర్ పెరిగింది.ఇక ఈ రోజు బాహుబలి ది ఎపిక్ ప్రేక్షకుల ముందుకు రాగా, ఇందులో మెయిన్ ఎపిసోడ్స్‌ని అలానే ఉంచారు. దాంతో ప్రేక్షకులకి బోరింగ్ ఫీలింగ్ కలగలేదు. ఎమోషన్ సీన్లు, యాక్షన్ సీన్లు అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్లు హైలైట్‌గా ఉన్నాయి అనే చెప్పాలి. ఆయనకు పడ్డ ఎలివేషన్లు ప్రేక్షకులకి హై ఫీల్ ఇస్తాయి. ఇటీవల చాలా సినిమాల్లో ఇలాంటి ఎలివేషన్లు మనం చూస్తూనే ఉన్నాం. కానీ వాటిని మించి ఇందులో ఉండటం విశేషం. అప్పుడు కూడా ఇంతగా ఆడియెన్స్ ఫీలయ్యారో లేదో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
 
                            