Baahubali Re Release | టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుండగా, వాటికి మంచి రెస్పాన్స్ వస్తుంది. కొత్తగా థియేటర్లలోకి వచ్చే సినిమాలు ఓపెనింగ్స్ కోసం తెగ కష్టపడుతున్న తరుణంలో, పాత హిట్లు మాత్రం తిరిగి విడుదలై రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఆ మధ్య వచ్చిన మహేష్‌బాబు ‘ఖలేజా’ రీ-రిలీజ్ బ్లాక్‌బస్టర్ వసూళ్లను అందుకుంది. ఈ ట్రెండ్‌లోనే ఇప్పుడు ఇండియన్ సినిమా గర్వంగా చెప్పుకునే ‘బాహుబలి’ తిరిగి థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది! బాహుబలి తొలి భాగం ‘ది బిగినింగ్’ (2015) విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, మేకర్స్ భారీగా ప్లాన్ చేస్తున్నారు. అయితే కేవలం ఒక్క భాగం కాదు… ‘బాహుబలి 1’ మరియు ‘బాహుబలి 2’ సినిమాలను కలిపి ఒకే సినిమాగా ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో 2025 అక్టోబర్ 31న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయబోతున్నారు.
బాహుబలి 1 నిడివి 2 గంటల 38 నిమిషాలు కాగా, బాహుబలి 2 నిడివి 2 గంటల 31 నిమిషాలు. మొత్తంగా కలిపితే 5 గంటలకు పైగా రన్ టైమ్ ఉంటుంది. అయితే ప్రేక్షకుల ఆసక్తిని కొనసాగించేందుకు, పలు పాటలు, అనవసర సన్నివేశాలను కత్తిరించి, మూడున్నర గంటల తో సినిమా రెడీ చేస్తున్నారు. అంతేకాదు, గతంలో తొలగించిన డిలీటెడ్ సీన్స్‌ను ఇందులో చేర్చనున్నారు. ఇది ఈ సినిమాకు కొత్తదనంగా ఉండడంతో పాటు మూవీపై ఆసక్తిని మరింత పెంచనుంది. ఈ స్పెషల్ ఎడిషన్‌కి కొత్త సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది కాబట్టి దీనిని త్వరలో సెన్సార్ బోర్డుకు పంపించనున్నారు. .ఇక సినిమాలో ఇంటర్వెల్ పాయింట్లో ‘బాహుబలి 1’ ముగుస్తుంది. రెండో భాగం కథ సెకండ్ హాఫ్‌లో మొదలవుతుంది.
బాహుబలి ఫ్రాంచైజీ మొత్తంగా రూ.2400 కోట్లకు పైగా వసూలు చేసింది. రీ-రిలీజ్ వర్షన్‌తో రూ.40-50 కోట్లు వసూలు అవుతుందని అంచనా. ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన రీ-రిలీజ్ చిత్రాలు చూస్తే సనమ్ తేరీ కసమ్ 41 కోట్లు రాబట్టగా, తుంబాద్ మూవీ 38 కోట్లు వసూళ్లు సాధించింది. మురారి (తెలుగు) – ₹10 కోట్లు,ఖలేజా – ₹9 కోట్లుకి పైగా వసూళ్లు రాబట్టింది. వీటన్నింటిని ‘బాహుబలి: ది ఎపిక్’ చెరిపేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రీలోడెడ్ వర్షన్ కోసం ప్రేక్షకులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.