Baahubali | భారత సినీ చరిత్రను మార్చిన సినిమా ‘బాహుబలి’ ఇప్పుడు మరోసారి థియేటర్లకు రానుంది. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ విజువల్ వండర్‌కి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేకంగా ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో ఓ కొత్త ఎడిషన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఈ సినిమా రెండు భాగాలను (బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్) కలిపి ఒకే సినిమాగా తీర్చిదిద్దారు. దాదాపు 6 గంటల నిడివి ఉన్న ఈ రెండు సినిమాలను కట్ చేసి, సుమారు 3 గంటల ప్రత్యేక ఎడిషన్‌గా రూపొందించారని సమాచారం. దీనిని అక్టోబర్ 31, 2025 న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో బాహుబలి 1, 2 సినిమాలు కలిపి రూ.2500 కోట్ల వరకూ వసూళ్లు సాధించాయి.
భారత సినిమా ఇండస్ట్రీని పాన్ ఇండియా మార్కెట్‌గా మార్చిన సినిమాగా పేరుగాంచిన బాహుబలి ఇప్పుడు తక్కువ నిడివితో, మరింత స్పీడ్, థ్రిల్లింగ్ ఎడిట్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రభాస్ అభిమానులు బాహుబలి కోసం ఇప్పటి నుంచే అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు ఈ కథ అందరికీ తెలిసినదే అయినా, థియేటర్లో ఫీల్ వెరే లెవెల్ అనే భావనతో మళ్లీ చూడాలనే ఆసక్తి నెలకొంది. అయితే కొంతమంది మాత్రం, టీవీలో, ఓటీటీలో పదులసార్లు చూశాం కదా… మళ్లీ ఏం చూస్తాం అనే ఆలోచనలో ఉన్నారు.
ఈ క్రమంలో బాహుబలి రీ రిలీజ్ వంద కోట్లు వసూలు చేస్తుందా అనే చర్చ మొదలైంది. కొందరు ఇది సాధ్యం కాదు అని అంటున్నారు.. కొత్త సన్నివేశాలు, మరింత ప్యాక్డ్ ఎడిటింగ్ ఉంటే వసూళ్ల పరంగా మళ్లీ సంచలనం కావచ్చు. రాజమౌళి స్వయంగా ఈ ఎడిటింగ్‌పై కేర్ తీసుకుంటే, ప్రేక్షకులకి మళ్లీ బాహుబలి పూనకం రావడంలో ఎలాంటి సందేహం లేదు అని అభిమానులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక ఎడిషన్ విడుదలకు ముందుగా ప్రభాస్, అనుష్క, తమన్నా, రాజమౌళి, కీరవాణి మీడియా ముందుకు వచ్చి సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. దీంతో రిలీజ్ హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది.అక్టోబర్ 31న ‘బాహుబలి ది ఎపిక్’తో పాటు మరో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ బాహుబలి దెబ్బకి ఆ సినిమాను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.