క్రౌన్ ఆఫ్ బ్లడ్ డిస్నీ హాట్‌స్టార్: మే 17
దర్శకులు: జీవన్ జె కాంగ్, నవీన్ జాన్
తెలుగు సినిమాకు జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చిన సినిమా బాహుబలి. ఇండియన్ సినిమాలకు టాలీవుడ్ స్టామినాను రుచి చూపించిన ఈ సినిమా ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసారి యానిమేటెడ్ వెర్షన్లో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయ్యింది. బాహుబలి సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి.. ఈ యానిమేటెడ్ వెర్షన్‌కు ఒకానొక నిర్మాతగా వ్యవహరించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో పలు భాషల్లో అందుబాటులోకి వచ్చిందీ మూవీ.
కథ: మాహిష్మతి సామ్రాజ్యం చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను ఆక్రమిస్తూపోతున్నాడు రక్తదేవ్ అనే క్రూరుడైన రాజు. అలా మాహిష్మతి సామ్రాజ్యాన్ని కూడా ఆక్రమించుకోవాలని భావిస్తాడు. ఆ రక్తదేవ్ను బాహుబలి, భల్లాలదేవ కలిసి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఈ కథలో బాహుబలికి భిన్నంగా మాహిష్మతిని సొంతం చేసుకోవాలని భావించే రక్తదేవ్‌కు విధేయుడిగా పనిచేస్తాడు కట్టప్ప. అది ఈ కథలోని ఆసక్తికర అంశం. అసలు రక్తదేవ్ ఎవరు? ఈ కథలో ఆయన పాత్ర ఏంటి? రక్తదేవ్ పక్కన కట్టప్ప ఎందుకు ఉన్నాడు? బాహుబలి, భల్లాలదేవ కలిసి తమ సామ్రాజ్యాన్ని కాపాడుకున్నారా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం ఈ సిరీస్ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తిని రేకెత్తించిందో.. ఈ యానిమేటెడ్ సిరీస్‌లో కూడా కట్టప్ప క్యారెక్టర్ అంత ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుంది. బాహుబలి, రక్తదేవ్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు సిరీస్‌పై ఆసక్తిని పెంచుతాయి. ఇక, బాహుబలి పేరు వినగానే గుర్తొచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఈ యానిమేటెడ్ సిరీస్‌లో బాహుబలి లుక్స్ పర్వాలేదనిపిస్తాయి అంతే. డబ్బింగ్ కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే, బాహుబలి సినిమాకు ఉన్న క్రేజ్‌తో ఈ సిరీస్ చూస్తే నిరాశ తప్పదు. దర్శకుడు జీవన్ జె కాంగ్, నవీన్ జాన్ ఎంతో కష్టపడి ఈ ఔట్పుట్ తీసుకొచ్చారని చెప్పాలి. బాహుబలి యానిమేటెడ్ వెర్షన్ భారీ అంచనాలతో ఓటీటీలో విడుదలైన ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ బాగానే ఉంది. అంచనాలు పెట్టుకోకుండా చూస్తే ఈ వేసవిలో పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేయొచ్చు.