B Unnikrishnan | మలయాళ నటులు సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ'(Janaki Vs State of Kerala) సినిమా టైటిల్ మార్చాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఆదేశించడాన్ని మలయాళ చిత్ర దర్శకుడు, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (FEFKA) జనరల్ సెక్రటరీ బి. ఉన్నికృష్ణన్ తీవ్రంగా ఖండించారు. CBFC తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మనం ఏ కాలంలో బతుకుతున్నాం? అని ప్రశ్నించారు.
ఈ సినిమా టైటిల్లో జానకి పేరు ఉండడం వలన ఆ పేరును మార్చాలని సెన్సార్ బోర్డు తెలిపింది. ‘జానకి’ అనే పేరు హిందూ దేవత సీత పేరుకు మరో రూపం కావడంతో, లైంగిక దాడికి గురైన మహిళా పాత్రకు ఈ పేరు పెట్టడం మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తుందని CBFC అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే సెన్సార్ ఇచ్చిన రిపోర్ట్‌పై నిర్మాతలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఈ వివాదంపై ఉన్నికృష్ణన్ మాట్లాడుతూ.. లైంగిక దాడికి గురైన మహిళకు జానకి అని పేరు పెట్టకూడదని CBFC సిగ్గు లేకుండా వాదించింది. ఇదేకాకుండా.. జానకిని విచారణ చేసే న్యాయవాది కూడా వేరే మతానికి చెందినవాడని సిగ్గులేకుండా ప్రస్తావించింది. అసలు మనం ఏ యుగంలో బతుకుతున్నాం? అని ఉన్నికృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. CBFC లాజిక్ ప్రకారం, జానకి అనే మహిళ కేసును భవిష్యత్తులో ముస్లిం న్యాయవాది హరీస్ బీరన్ కూడా తీసుకోలేరని ఉన్నికృష్ణన్ ఎద్దేవా చేశారు.
ఈ సినిమా దర్శకుడు ప్రవీణ్ నారాయణన్‌తో మాట్లాడిన తర్వాత, సినిమాలో ఎలాంటి మతపరమైన ప్రస్తావనలు లేవని తనకు అర్థమైందని ఉన్నికృష్ణన్ పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయం నిజంగా కలవరపరిచేలా ఉందని చాలా ఏకపక్షమైనది అని ఆయన అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సినిమాల విషయంలో CBFC ఇలాంటి అడ్డదిడ్డమైన నిర్ణయాలు తీసుకుంటుందని ఉన్నికృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను తీవ్రంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఈ విషయంపై అధికారులు ప్రభుత్వంతో మాట్లాడాలని భావిస్తున్నామని చెప్పారు.