ప్రపంచ సినీ వేదికపై భారతీయ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా. మన సంస్కృతి, సంప్రదాయల నేపథ్యంతో తెరకెక్కించే చిత్రాలు దేశాల హద్దులు దాటి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని ఆయన అన్నారు. ఇటీవల ఆస్కార్ పురస్కార నామినేషన్స్‌లో మూడు దేశీయ సినిమాలు నామినేట్ అవడంపై ఈ యువ హీరో స్పందించారు.
ఆయుష్మాన్ మాట్లాడుతూ…‘ప్రపంచ సినిమాను భారత చలన చిత్ర పరిశ్రమ ప్రభావితం చేయగలదనే నమ్మకం నాకు ఎప్పటినుంచో ఉండేది. స్వదేశీ కథలను తెరపై చూపించడం మన సినిమా అస్తిత్వానికి కారణం. ఇవాళ అదే గ్లోబల్‌గా భారతీయ చిత్రాలకు ప్రత్యేకత తీసుకొస్తున్నది. మన సినిమా ప్రపంచాన్ని సాంస్కృతికంగా కూడా ప్రభావితం చేయగలదు. మన చిత్ర పరిశ్రమల్లో పుష్కలమైన ప్రతిభ ఉంది. ప్రస్తుతం భారతీయ సినిమా పునర్జీవనం పొందుతున్నదని చెప్పుకోవచ్చు. ఆస్కార్ నామినేషన్స్ కూడా దీన్నే ప్రతిబింబిస్తున్నది’ అన్నారు. ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానా ‘డ్రీమ్ గర్ల్ 2’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అనన్య పాండే నాయికగా నటిస్తున్నది. జూలై 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.