Avs Daughter | ఫాదర్స్ డే సందర్భంగా ప్రసారంకానున్న ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రత్యేక ఎపిసోడ్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయనుంది. ఈ ఎపిసోడ్కు ప్రముఖ హాస్యనటుడు స్వర్గీయ ఏవీఎస్ కుమార్తె శాంతి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. తండ్రి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆమె ఎమోషనల్ అయిన క్షణాలు ప్రోమోలో హైలైట్గా నిలిచాయి. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్యంతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఏవీఎస్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తండ్రి ప్రాణాలను కాపాడేందుకు శాంతి తన లివర్లో కొంత భాగాన్ని దానం చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే అనంతరం ఏవీఎస్ మరణించడంతో ఆమె కొంతకాలం ప్రజలకు దూరంగా ఉన్నారు. ఇటీవల మళ్లీ సీరియల్స్, టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఫాదర్స్ డే స్పెషల్ ఎపిసోడ్లో పలువురు ఆర్టిస్టులు తమ తల్లిదండ్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సరదా సంభాషణలు, వినోదాత్మక టాస్కులు ప్రేక్షకులను అలరించనున్నాయి. యాంకర్ మానస్ తన తండ్రిని “నాలో నచ్చిన విషయం, నచ్చని విషయం ఏమిటి?” అని అడగగా, ఆయన ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది. అలాగే ఇతర ఆర్టిస్టుల తల్లిదండ్రులు చేసిన కామెంట్లు కూడా ఎపిసోడ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే కార్యక్రమంలో అసలు భావోద్వేగ ఘట్టం సింగర్స్ ఆలపించిన తండ్రి ప్రేమను గుర్తు చేసే పాటల సమయంలో చోటుచేసుకుంది. ఆ పాటలు వింటూ శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. ఇలాంటి పాటలు వింటుంటే మా నాన్న మళ్లీ వస్తే బాగుండనిపిస్తోంది అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె మాటలు అక్కడున్న వారిని కూడా కదిలించాయి.
ఈ సందర్భంగా నటుడు రాజీవ్ కనకాల కూడా ఎమోషనల్ అయినట్లు ప్రోమోలో కనిపించింది. అలాగే కమెడియన్ పటాస్ ప్రవీణ్ తన తండ్రిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం ప్రవీణ్, ఆయన భార్యతో కలిసి నిర్వహించిన ప్రత్యేక సెలబ్రేషన్ కూడా ఎపిసోడ్లో చోటు చేసుకుంది. ప్రవీణ్ భార్య మాట్లాడుతూ, నాకు తండ్రిలాంటి భర్త దొరికాడు అంటూ భావోద్వేగంగా మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంది. మొత్తంగా ఫాదర్స్ డే స్పెషల్గా రూపొందించిన ఈ ఎపిసోడ్ సరదా, నవ్వులు, భావోద్వేగాల కలయికగా ఉండబోతుందని విడుదలైన ప్రోమో స్పష్టం చేస్తోంది.