“పెద్ది’ కథ విన్న తర్వాత ఓ ఇరవై నిమిషాలు ఈ లోకంలోకి రాలేకపోయా. అంతలా నన్ను కదిలించింది. ఈ సినిమా కోసం 1970-80 దశకంనాటి కాలమాన పరిస్థితుల్ని సెట్స్‌లో రీక్రియేట్ చేశాం’ అన్నారు ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. తెలుగులో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన తాజాగా రామ్‌చరణ్ ‘పెద్ది’ చిత్రానికి వర్క్ చేశారు. జూన్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం అవినాష్ కొల్లా విలేకరులతో ముచ్చటించారు. ఇది పీరియాడిక్ డ్రామా కాబట్టి సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు. ‘విజయనగరం నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడి వీధులతో పాటు క్లాక్‌టవర్‌ని రీక్రియేట్ చేశాం. కుస్తీ, క్రికెట్ గ్రౌండ్స్‌కి సంబంధించిన సెట్స్‌ని కూడా కొత్తగా డిజైన్ చేశాం’ అన్నారు.
ఒక సెట్ డిజైన్ చేసినప్పుడు సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అది సెట్ అని తెలియకూడదని, అప్పుడే ఆర్ట్ డైరెక్టర్ సక్సెస్ అయినట్లని అవినాష్ కొల్లా తెలిపారు. ఇందులో హిల్‌స్టేషన్ ఊరి కోసం హైదరాబాద్ బూత్‌బంగ్లాలో ఓ సెట్ వేశామని, సినిమాలో అది నిజంగా కొండమీది ఊరిలా కనిపిస్తుందని, ఆ సెట్‌ని ఛాలెంజ్‌గా తీసుకొని డిజైన్ చేశామన్నారు. ‘ఈ సినిమాలో మొత్తం 24 సెట్స్ ఉంటాయి. రామ్‌చరణ్ వాడే బ్యాట్‌ని కూడా సహజంగా మేమే డిజైన్ చేశాం. సినిమాలో క్రికెట్ సన్నివేశాలను చూస్తున్నప్పుడు ఊరి పొలం గట్ల మీద కూర్చొని క్రికెట్ చూసిన అనుభూతి కలుగుతుంది. అది సెట్ అని ఎవరూ గుర్తుపట్టలేరు. అంత సహజంగా ఉంటుంది’ అన్నారు.