అఖిల్‌రాజ్, తేజస్విని జంటగా నటించిన యథార్థ ప్రేమకథ ‘రాజు వెడ్స్ రాంబాయి’. సాయిలు కంపాటి దర్శకుడు. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మాతలు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన హీరో కిరణ్ అబ్బవరం, తరుణ్ భాస్కర్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘ఇది ఏ ఒక్క ప్రాంతానికో చెందిన కథ కాదు. ఈ తరహా సంఘర్షణలు ప్రతి చోటా ఉంటాయి. ప్రతి ప్రేమజంటా తమకు తాము రిలేట్ చేసుకునేలా ఇందులోని హీరోహీరోయిన్ల పాత్రలుంటాయి. దర్శకుడు సాయిలు తనలోని నిజాయితీని ఈ కథలో చూపించారు.
తల్లిదండ్రుల్ని కూడా ఆలోచింపజేసే సినిమా ఇది.’ అని నిర్మాతల్లో ఒకరైన వేణు ఊడుగుల అన్నారు. బయటకు రానీయకుండా పదిహేనేళ్లపాటు సమాధి చేయబడ్డ ప్రేమకథ ఇదని, ఇందులో హెలికాప్టర్ షాట్స్, మెట్రో షాట్స్ ఉండవని, ఊళ్లో తిరిగే ఆటోడ్రైవర్లు, కాలేజీలకెళ్లే అమ్మాయిలూ వీళ్లే కనిపిస్తారని, రాత్రింబవళ్లూ కష్టపడి ఈ సినిమా చేశామని, చూస్తున్నంతసేపూ మీ ఊరు గుర్తొస్తుందని దర్శకుడు సాయిలు కంపాటి నమ్మకంగా చెప్పారు. ఇంకా చిత్రబృందంతోపాటు ఈటీవీ విన్ ప్రతినిధులు సాయికృష్ణ, నితిన్, నిర్మాత వంశీ నందిపాటి కూడా మాట్లాడారు.