Venu Swamy | ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి దంపతలు సోమవారం సంచలన వీడియో విడుదల చేశారు. పలువురు మీడియా పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఓ సీనియర్ జర్నలిస్ట్, ఆయన అనుచరులు రూ.5కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని.. ఇందుకు సంబంధించిన కాల్ ఆడియోను సైతం షేర్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ గతంలో ఓ టీవీ ఛానెల్లో దాడి చేసేందుకు సైతం ప్రయత్నించాడని ఆరోపించారు. తనను నాశనం చేసేందుకు ఆ సమయంలోనే చాలా ప్రయత్నాలే చేశాడని.. తాను మాత్రం డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు. ప్రస్తుతం మళ్లీ తనను డబ్బు కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. టీవీ డిబేట్లలో తనపై డిబేట్లు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని.. ఎందరో కష్టాలను తాను తొలగించే ప్రయత్నం చేశానని, తాను ఆత్మహత్య చేసుకునే స్థితి తీసుకువచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు.
టార్చర్‌ని తాను భరించలేకపోతున్నానని వాపోయారు. సదరు సీనియర్ జర్నలిస్ట్ అనుచరుడి ఫోన్ కాల్‌కు సంబంధించిన కాల్ రికార్డింగ్‌ను ఇన్స్టావేదికగా విడుదల చేశారు. ఆ కాల్లో రూ.5కోట్ల విషయంపై చర్చ జరిగింది. వచ్చే డబ్బులను ఎవరెవరు పంచుకుంటారనే విషయం అనుచరుడు చెప్పడం కనిపించింది. ఛానెల్ అధినేతతో పాటు కీలక స్థానాల్లోని ఉద్యోగుల వరకు పంపకాలను వివరించాడు. వేణుస్వామి భార్య వీణా శ్రీవాణి మాట్లాడుతూ రూ.5కోట్లు తాము ఎక్కడి నుంచి తీసుకువస్తామని.. ఇంట్లోని బంగారం అమ్మినా అంత డబ్బు రాదని.. అడిగిన సొమ్ము ఇచ్చేదాక వాళ్లు తమను వదిలేలా లేరని వాపోయింది. ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నామని.. దాన్ని కూడా తప్పుగా ప్రచారం చేస్తారని చెప్పింది. సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు రాస్తారని.. తమ చావులు వృథా కావొద్దనే ఇలా అందరి ముందుకు వచ్చామని.. జర్నలిజం ముసుగులోని వాళ్ల అసలు రూపం ఏంటో ప్రపంచానికి చెప్పాలని నిర్ణయించుకున్నామన్నారు.
వీడియో బయటకు వచ్చాక సైతం ప్రమాదం ఉంటుందని.. తప్పనిసరిగా తమను చంపేస్తారని.. అలాగోనే వాళ్లు ఎలాటి వారో ప్రపంచానికి తెలుపుతున్నామన్నారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వలేమని.. ఈ వీడియోనే మరణ వాంగ్మూలంగా తీసుకోవాలని ఆశిస్తున్నామని.. ఆడియోతో పాటు చాలా సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. వారు తమను బతకనిస్తే మరిన్ని వీడియోలు ప్రపంచానికి చూపిస్తామన్నారు. తమకు ఎన్ని జర్నలిస్ట్ సంఘాలు.. బ్రాహ్మణ సంఘాలు.. విద్యావంతులు, పోలీసులు, న్యాయవాదులు అండగా నిలుస్తారో చూద్దామని.. ఎవరైనా మద్దతు నిలుస్తారని ఆశిస్తున్నామన్నారు. జ్యోతిష్యం చెప్పుకొని బ్రతికేవారినే రూ.5కోట్లు డిమాండ్ చేస్తే.. మిగతా వ్యక్తుల వద్ద ఎంత మొత్తంలో వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవాలని.. ఈ విషయంలో తమ ప్రాణాలు పోయినా పర్వాలేదని.. ఇంకా బ్రతికి ఉంటే మరో వీడియో రిలీజ్ చేస్తామని లేకపోతే ఇదే చివరి వీడియో కావచ్చని వేణుస్వామి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.