తమ ప్రేమకథ బాలీవుడ్ స్క్రిప్ట్‌కు ఏమాత్రం తీసిపోదని అంటున్నాడు సీనియర్ నటి అసిన్ భర్త, ప్రముఖ వ్యాపారి.. రాహుల్ శర్మ. వారి లవ్‌స్టోరీ సక్సెస్ కావడంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలకపాత్ర పోషించాడని చెప్పుకొచ్చాడు. 2012లో ఢాకాలో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోనే తమ ప్రేమకథ మొదలైందని వెల్లడించాడు.
ఇటీవల ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అసిన్‌తో తన మొదటి పరిచయం, వారిమధ్య ప్రేమ చిగురించడం గురించిన విషయాలను పంచుకున్నాడు. 2012లో అసిన్, అక్షయ్‌కుమార్ కలిసి ‘హౌస్‌ఫుల్-2’లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఢాకాలో జరిగిన ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను ఎంచుకున్నారు. ఆ క్రికెట్ టోర్నీని మ్యాక్రోమ్యాక్స్ స్పాన్సర్ చేయడంతో.. ఆ సంస్థ సహవ్యవస్థాపకుడైన రాహుల్ శర్మ కూడా అక్కడే ఉన్నాడు.
“ఆ మ్యాచ్ సందర్భంగానే నేను, అసిన్ మొదటిసారి కలుసుకున్నాం. మా ఇద్దరి మధ్యా ప్రొఫెషనల్‌గా అనేక పోలికలు ఉన్నాయనీ, ఇద్దరం మంచిజోడీ అవుతామని అక్షయ్‌కుమార్ భావించారు. అదే విషయం మాకు చెప్పి.. ఒకరి ఫోన్ నెంబర్ మరొకరికి ఇచ్చారు” అంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నాడు రాహుల్. ఎందుకని అడిగితే.. ‘ఈ అమ్మాయి కూడా మీలాగే చాలా సింపుల్. డౌన్ టూ ఎర్త్. వస్తుంది.. తన పని తను చేసుకుంటుంది. వెళ్లిపోతుంది. చాలా ప్రొఫెషనల్ కూడా! వాళ్ల ఫ్యామిలీ కూడా అంతే! వీళ్ల అమ్మ డాక్టర్‌గా సేవలందిస్తుంటే.. తండ్రి సమాజ సేవ చేస్తుంటారు. నాకెందుకో మీ ఇద్దరూ మంచి జోడి అవుతారని అనిపిస్తున్నది. అందుకే!’ అంటూ చెప్పాడట అక్షయ్ కుమార్. అప్పటి వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారి.. పెళ్లి పీటలెక్కింది.
“నన్ను – అసిన్‌ను కలిపినందుకు అక్షయ్ కుమార్‌కు చాలా థ్యాంక్స్! ఆ పరిచయం.. నా జీవితానికి ఆయన చేసిన గొప్ప సహకారం” అంటూ చెప్పుకొచ్చాడు రాహుల్. 2016 జనవరిలో రాహుల్ శర్మ – అసిన్ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఒకపాప. ఇక కేరళలోని కొచ్చికి చెందిన అసిన్.. తెలుగు, తమిళ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2008లో అమీర్‌ఖాన్ సరసన ‘గజినీ’తో బాలీవుడ్లో అడుగుపెట్టింది. రెడీ, లండన్ డ్రీమ్స్, హౌస్‌ఫుల్ 2, బోల్ బచ్చన్, ఖిలాడీ 786 లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత సినిమాలకు పుల్‌స్టాప్ పెట్టేసింది.