Ashu Reddy | బిగ్‌బాస్ ఫేమ్ సినీనటి అషురెడ్డి చుట్టూ కొనసాగుతున్న వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ప్రేమ, పెళ్లి పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసిందన్న ఆరోపణలతో ఇప్పటికే ఈ కేసు హాట్‌టాపిక్‌గా మారగా, తాజాగా లీకైన ఆడియోతో మరింత సంచలనంగా మారింది. ఎన్ఆర్ఐ ధర్మేంద్ర చేసిన ఫిర్యాదు ప్రకారం, 2018లో అషురెడ్డితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారిందని, పెళ్లి చేస్తానని నమ్మించి దాదాపు రూ.9.5 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆ డబ్బుతో బంగారం, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసిందని, కుటుంబ సభ్యుల పేర్లతో కూడా నగదు వసూలు చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
డబ్బులు తిరిగి ఇవ్వమంటే అషురెడ్డి బెదిరింపులకు దిగిందని, తప్పుడు కేసులు పెడతానని లేదా ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించిందని ధర్మేంద్ర ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం మరింత తీవ్రంగా మారింది. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఆడియో సందేశం కేసుకు కీలక మలుపు తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా పంపినట్లు చెబుతున్న ఈ వాయిస్ మెసేజ్‌లో, “మే నెల వరకు సమయం ఇస్తే కోటిన్నర రూపాయలు ఇస్తాను, మిగతావి తర్వాత చెల్లిస్తాను” అని అషురెడ్డి చెప్పినట్లు వినిపిస్తోంది. ఈ వ్యాఖ్యలతో ఆమె డబ్బులు తీసుకున్నట్టేనా అన్న అనుమానాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
ఈ ఆడియోలో జ్యోతిష్కుడు వేణు స్వామి పేరు ప్రస్తావన రావడం మరింత చర్చకు దారి తీసింది. “నీ వైపు నుంచి వేణు స్వామిని తీసుకురావచ్చు లేదా ఇంకెవరినైనా తీసుకురావచ్చు” అంటూ అషురెడ్డి చెప్పినట్లు వినిపిస్తోంది. దీంతో ఈ వివాదంలో వేణు స్వామి పాత్ర ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో వీరి పెళ్లి విషయమై జాతకాలు చూసిన వ్యక్తి ఆయనే అన్న ప్రచారం మళ్లీ వెలుగులోకి వచ్చింది.
అదే ఆడియోలో పెద్దల మధ్య సెటిల్మెంట్ చేసుకుందామని అషురెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. తన తరఫున ఒక సీరియల్ నటి వస్తుందని, ధర్మేంద్ర తనవైపు నుంచి ఎవరినైనా తీసుకురావచ్చని చెప్పడం గమనార్హం. అయితే బాధితుడు మాత్రం పూర్తి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇది మోసం కేసేనని స్పష్టం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, పోలీసులు ఇప్పటికే మోసం, కుట్ర వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి FIR రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. పోలీసులు తన వాదన వినకుండా కేసు నమోదు చేశారని, విచారణను నిలిపివేయాలని కోరింది.