‘ఈ సినిమా మొదలుపెట్టి రెండేళ్లవుతుంది. లాక్డౌన్ల నడుమ వీలుదొరికినప్పుడల్లా చిత్రీకరణ జరిపాం. మా నిరీక్షణ ఫలించే సమయం వచ్చింది. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ నెల 15న మా అబ్బాయిని, సంస్థను పరిచయం చేయబోతున్నాం’ అన్నారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ఆయన తనయుడు, అగ్రహీరో మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘హీరో’.శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. గల్లా పద్మావతి నిర్మాత. ఈ నెల 15న ప్రేక్షకులముందుకురానుంది. గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గల్లా జయదేవ్ మాట్లాడుతూ ‘కృష్ణగారు ఈ నెల 15న విడుదల చేయమని సలహానిచ్చారు. ఈ బ్యానర్‌ను మా అబ్బాయి కోసమే పెట్టాం. వాడికి చిన్నప్పటి నుంచి నటనంటే ప్రాణం.
సింగపూర్, టెక్సాస్‌లలో యాక్టింగ్ కోర్సులు చేశాడు. నా కుమారులు అశోక్, సిద్ధార్థ్ ఈ బ్యానర్‌ను ముందుకుతీసుకెళ్లాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘ఈ కథకు కొత్త హీరో అయితేనే బాగుంటుందనుకున్నా. స్టోరీకి తగిన టైటిల్ దొరికింది. ఈ సినిమాలోని కౌబాయ్ ఎపిసోడ్ ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. సంక్రాంతి సీజన్లో ఓ పండుగలాంటి సినిమా ఇది’ అని దర్శకుడు తెలిపారు. హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ ‘సంక్రాంతి రిలీజ్ అనేసరికి టీమ్ అందరిలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ సినిమాతో నా కల నిజమవుతున్నట్లు అనిపిస్తున్నది. ఆద్యంతం చక్కటి హాస్యంతో ప్రేక్షకుల మోముల్లో నవ్వులు పూయిస్తుంది. తాతయ్య ఫ్యాన్స్, మహేష్‌బాబుగారి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాకు మద్దతుగా నిలుస్తున్నారు’ అని చెప్పారు. ఈ సినిమా ద్వారా అశోక్ ప్రతిభాపాటవాలు అందరికి తెలుస్తాయని పద్మావతి గల్లా తెలిపింది.