ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కన్నడభామ అషిక రంగనాథ్. ఈ ఏడాదే మెగాస్టార్ ‘విశ్వంభర’తో ఈ అందాలరాశి మరోసారి తెలుగు తెరపై మెరవనున్నది. తాజాగా శర్వానంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో కూడా కథానాయికగా ఎంపికైంది అషికా రంగనాథ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అషికా మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఏ భాషలో సినిమా తీసినా దేశమంతా చూస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేభాషకు పరిమితం కావాలన్నా కాలేం. కళాకారులకు ఎల్లలు తెగిపోయాయి.
ఈ పానిండియా యుగంలో అందరూ జాతీయ నటులే. ఇది ఓ విధంగా మంచి పరిణామం. అందుకే భాషతో పట్టింపు లేకుండా సినిమాలకు సంతకాలు చేస్తున్నాను.’ అంటూ చెప్పుకొచ్చింది అషికా రంగనాథ్. ఇంకా చెబుతూ ‘కార్తీతో నేను చేసిన ‘సర్దార్ 2’ ఈ సమ్మర్లోనే రానుంది. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నటిగా నన్ను మరోస్థాయిలో నిలబెట్టే సినిమా అది. ఈ సినిమాకోసం ఎదురు చూస్తున్నా.’ అని తెలిపింది అషికా రంగనాథ్.